తెలంగాణపై సస్పెన్స్‌కు త్వరలో తెర

న్యూఢిల్లీ: తెలంగాణ అంశం సస్పెన్స్‌కు ఇక తెరపడనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 22న ప్రారంభమవుతున్నందున.. అంతకంటే ముందే తెలంగాణ అంశాన్ని తేల్చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ప్రత్యేక రాష్ట్ర అంశంపై ఢిల్లీలో వచ్చే వారం అత్యంత కీలకమైన ప్రకటన ఒకటి వెలువడే అవకాశాలు విస్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా.. తెలంగాణ అంశాన్ని రెండో ఎస్సార్సీకి నివేదించే ఉద్దేశం కేంద్రానికి లేదని, కేవలం ఉత్తరప్రదేశ్ విషయంలో మాత్రమే అది వర్తిస్తుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం శ్రీకృష్ణ కమిటీ నివేదికలో సూచించిన 4, 5, 6 సిఫారసుల ఆధారంగా.. తెలంగాణపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోబోతున్నదని తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి, రెండు ప్రాంతాలకూ వేర్వేరు రాజధానులను ప్రకటించడమా? లేక హైదరాబాద్‌ను ప్రస్తుతానికి ఉమ్మడి రాజధానిగా నిర్ణయించి.. ఆ తరువాత సీమాంధ్రకు వేరే రాజధానిని ప్రకటించడమా? అన్న రెండు మార్గాలే కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. మాల్దీవుల్లో జరుగుతున్న సార్క్ సమావేశాలకు వెళ్లిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్వదేశానికి శనివారం తిరిగి రానున్నారు. ఆయన రాగానే తెలంగాణపై కదలికలు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కాగా.. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రెండోసారి కీలక సమాలోచనలు జరిపారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌తో తాను శుక్రవారం చర్చలు జరిపిన తర్వాత స్పష్టత ఏర్పడుతుందని బొత్స చెప్పారు. మరోవైపు ప్రణబ్‌ను కలిసే ముందు కెకె బొత్సతో మంతనాలు జరిపారు. శ్రీకృష్ణ కమిటీ సూచించిన మూడు ప్రతిపాదనల పట్ల కోర్ కమిటీ దృష్టి సారిస్తున్నప్పటికీ అదే కమిటీ సూచించిన ప్రాంతీయ మండలి పట్ల మాత్రం విముఖతతో ఉన్నట్లుగా సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu