తెలంగాణ రాకపోతే కట్టుబానిసలం అవుతాం కేసీఆర్

నిజామాబాద్: తెలంగాణ రాకపోతే కట్టుబానిసలం అవుతామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. ఉద్యమాన్ని ఎలా నడపాలో తమకు తెలుసునని, ఎవరి సలహాలు కూడా తమకు అక్కర లేదని ఆయన అన్నారు. తల తెగినా తెలంగాణ ఉద్యమాన్ని వీడేది లేదని  నిజామాబాద్‌లో జరిగిన ఓ సభలో ఆయన ప్రసంగించారు. సంక్రాంతి తర్వాత అన్ని తెలంగాణ జెఎసిలతో చర్చించి, ఉద్యమాన్ని ఉధృతం చేసి పంజా విసురుతామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర్ర ఏర్పడిన తర్వాత సింగూరు జలాలు మెదక్, నిజామాబాద్ జిల్లాలకు మాత్రమే అందేట్లు చూస్తామని ఆయన చెప్పారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని ఆయన చెప్పారు. ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరు నూరైనా ఉద్యమాన్ని వీడేది లేదని, తెలంగాణ రావడం ఖాయమని ఆయన అన్నారు. మహిళలు చేస్తున్న దీక్షలను ఆయన విరమింపజేశారు. తెలంగాణలో సీమాంధ్రుల తీరు మారలేదని, బాన్సువాడ ఉప ఎన్నిక ఓటింగు సరళి చూస్తే అది అర్థమవుతోందని ఆయన అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu