పోలీసుల ఆత్మ‌లు ఘోషిస్తున్నాయి.. డీజీపీ తీరుపై టీడీపీ ఆగ్ర‌హం..

రెండున్నరేళ్లలో పోలీస్‌ వ్యవస్థను డీజీపీ భ్రష్టుపట్టించారు.. ప్రాణత్యాగం చేసిన పోలీసుల ఆత్మలు డీజీపీ తీరుతో ఘోషిస్తున్నాయి.. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలం.. అధికారంలోకి రాగానే ఏ మూల దాక్కున్నా లాగి వడ్డీతో సహా చెల్లిస్తాం.. అంటూ టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షులు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జగన్‌, వైసీపీ నేతలు వాడిన పదజాలంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని స‌వాల్ విసిరారు.

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు. సీఎం, డీజీపీ కలిసి కుట్రపన్ని చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించారు. నివాసం తర్వాత పార్టీ కార్యాలయంపైనే దాడి చేశారు. తెదేపా నేతల ఆర్థిక మూలాలను దెబ్బకొడుతూ అరాచకం సృష్టిస్తున్నారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమిది. దేశ చరిత్రలో ఎప్పుడూ ఈ రీతిలో జరగలేదు. సమాజ చైతన్యం కోసమే చంద్ర‌బాబు 36 గంటల దీక్ష అని అచ్చెన్న అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాదకద్రవ్యాల కేంద్రంగా మారుతోందని ఆవేదనతో పోరాడుతుంటే దాడికి దిగుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మత్తు పదార్థాల వల్ల యువత చెడిపోతున్నారన్నారు.   

పోలీసు అమర వీరుల త్యాగాలు వృధా అవుతున్నాయని మ‌రో టీడీపీ నేత జవహర్ అన్నారు. వారిని స్మరించుకునే రోజును కూడా ప్రతీకార దినంగా చేయడం దురదృష్టకరమని తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని.. పోలీస్ బాస్ వైసీపీ నాయకుడుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పదే పదే గృహ నిర్బంధంతో తన ప్రాధమిక హక్కులకు భంగం కలుగుతుందన్నారు. తనపై పోలీసులు కక్ష కట్టారని.. రెండు నెల‌ల నుంచి మానసికంగా తనను వేధిస్తున్నారని తెలిపారు. పార్టీ కార్యాలయానికి వెళ్ళకుండా అడ్డుకోవటం ముమ్మాటికి నేరమే అన్నారు. అధికారం ఉందని పోలీసులతో ఊడిగం చేయిస్తున్నారన్నారు. చంద్రబాబు దీక్షకు వెళ్ళకుండా ఆపినంత మాత్రాన ప్రజలకు నిజాలను దాయలేరని జవహర్ మండిప‌డ్డారు.