ఓటర్లు.. తిరుపతి లడ్డు కావాలా నాయనా..!

అధికారం కోసం అక్రమ కేసులు, బెదిరింపులు, దాడులు  ఒక ఎత్తు అయితే, తిరుపతిలో ఏకంగా దేవుడితో రాజకీయం చేస్తున్నారు. తిరుపతి పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు కొత్త ప్రచారానికి తెరలేపారు. ఒక్కో ఏరియాలో ఒక్కో విధానాన్ని అమలు చేస్తున్నారు. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గం తొండవాడ పంచాయతీలో ఎన్నికల కోసం దేవుడికి కూడా రాజకీయాలను ఆపాదిస్తున్నారు. వెంకన్న తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశవిదేశాల్లో ఎంత  ఫేమసో.. తిరుపతి లడ్డు కూడా అంతే ఫేమస్. ఇప్పుడు దాన్ని కూడా వైసీపీ నేతలు క్యాష్ చేసుకుంటున్నారు. ప్రచారంలో ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే వాహనాలను ఉపయోగిస్తూ. ఓటర్ స్లిప్పులతో పాటుగా శ్రీవారి లడ్డూలను పంచిపెడుతూ. ‘‘లడ్డూ తీసుకోండి...మాకు ఓటు వేయండి’’ అని అంటున్నారు. 

కరోనా తర్వాత తిరుపతికి భక్తులు పోటెత్తుతున్నారు. అక్కడ శ్రీవారి లడ్డూలు లభించక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ నేతలకు మాత్రం లడ్డూలకు కరువే లేదు. దర్జాగా తిరుపతి నుంచి తీసుకువచ్చి పంచాయతీ ఎన్నికల్లో పంచిపెడుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు మాత్రం చూసీచూడనట్టుగా ఉంటున్నారు. 

ప్రచారంలో వైసీపీ నేతలు శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని వినియోగించడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తిరుమల ప్రసాదాన్ని ప్రలోభాలకు వినియోగించడం దిగజారుడుతనమని వ్యాఖ్యానించారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారన్నారు. దేవాదాయశాఖ మంత్రి దీనిపై ఎందురు నోరు తెరవరని ప్రశ్నించారు. దేవుడి ప్రసాదంతోనూ వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి...ఇక దేవుడిని కూడా రాజకీయాల్లోకి దింపారంటూ వైసీపీ నేతల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu