తెలుగుదేశం,జనసేన ఉమ్మడి కార్యాచరణ.. వంద రోజుల టార్గెట్!

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం ఉండగా ఎన్నికల వేడి మాత్రం ఎప్పుడో పీక్స్ కు చేరింది. అధికార, విపక్షాలు ఎవరికి వారు నిర్దిష్ట ప్రణాళికలతో గెలుపు వేట మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రజా నాడి, ముందస్తు సర్వేల ఫలితాలతో  విపక్ష తెలుగుదేశం గెలుపు ధీమాతో ప్రజల మధ్యకు వెళ్తుండగా.. ఆ పార్టీకి జనసేన కూడా తోడు కావడంతో జోష్ తారస్థాయికి చేరింది. ప్రభుత్వం మరో అవకాశం కావాలంటూ ప్రజల వద్దకు వెళ్తున్నప్పటికీ  ప్రజల నుండి  వ్యతిరేకతే వ్యక్తమౌతోందన్నది ప్రస్ఫుటమైంది.  వైసీపీ బస్సుయాత్రకు సొంత పార్టీ కార్యకర్తలే మొహం చాటేస్తున్న పరిస్థితి ఉంది. ఈ సమయంలో  ప్రతిపక్ష పార్టీలు  తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కార్యాచరణతో  జనంలో మమేకమయ్యేందుకు రెడీ అయ్యాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విడుదలతో రెండు పార్టీలలో మొదలైన కదలిక  ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణ రూపంలో  ముందడుగు వేసింది. దీని కోసం రెండు పార్టీలు నియమించుకున్న సమన్వయ కమిటీ నేతలు గురువారం (నవంబర్ 11) సమావేశమై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.  

తెలుగుదేశం,జనసేన సమన్వయ కమిటీలు ఇప్పటికే అక్టోబర్ 23న రాజమహేంద్రవరంలోని మంజీర హోటల్‌లో ఒకసారి సమావేశమై కార్యాచరణపై చర్చించగా.. తాజాగా రెండో సమావేశం విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో గురువారం(నవంబర్9) నిర్వహించారు. ఈ రెండో సమావేశానికి తెలుగుదేశం తరఫున.. నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పితాని సత్య నారాయణ, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య హాజరవ్వగా.. జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పాలవలస యశస్వి, బొమ్మిడి నాయికర్, మహేందర్ రెడ్డి, కొటికలపూడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన, 100 రోజుల ప్రణాళిక, ఓటరు జాబితా అవకతవకలపై ఇరు పార్టీల నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ప్రజా సమస్యల వారీగా ఉద్యమ కార్యాచరణ చేపట్టే అంశంపై చర్చించిన్నట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

ఈ సమన్వయ కమిటీల సమావేశానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇద్దరూ హాజరు కాలేకపోయారు. తొలి సమావేశానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహించగా.. ఈ సమావేశానికి పవన్ తెలంగాణ ఎన్నికల పనిలో బిజీగా ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, కోర్టు బెయిల్ షరతుల నేపథ్యంలో చంద్రబాబు హాజరయ్యే అవకాశం లేదు. కాగా, ఈ సమావేశంలో రెండు పార్టీలు కలిసి చేపట్టనున్న ఉమ్మడి కార్యాచరణతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తం 100 రోజుల పగడ్బంధీ ప్రణాళికతో ఈ రెండు పార్టీలు బరిలోకి దిగనున్నాయి. అంటే మూడు నెలలుకు పైగా నేతలు ప్రజలు మధ్యనే ఉండనున్నారు. ఇప్పటికే ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంపై కొంత అవగాహనకు వచ్చిన ఈ రెండు పార్టీలు అదే అంశాలను ప్రజల మధ్య చర్చకు పెట్టాలని భావిస్తున్నారు. దీంతో పాటు ప్రజల నుండే ప్రత్యక్షంగా మరికొన్ని అంశాలను ఎంచుకొని మ్యానిఫెస్టోలో ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా, ఒక్కసారి టీడీపీ-జనసేన పార్టీలు ఉమ్మడిగా ఇరు పార్టీల జెండాలతో ప్రజల మధ్యకి వెళ్తే అధికార పక్షానికి వ్యతిరేకత మొదలైనట్లే. ప్రజలలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. దానికి తోడు చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారం కూడా జగన్ కు వ్యతిరేకంగా మారింది. ఈ తరుణంలో ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తే వైసీపీ ఉక్కిరి బిక్కిరి కావడం ఖాయం. గత రెండు నెలల ముందు కూడా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ యాత్రలలో సూటి ప్రశ్నలతో ప్రభుత్వానికి ఎక్కుపెట్టగా సమాధానం చెప్పుకోలేని వైసీపీ నేతలు మొహం చాటేసిన పరిస్థితి కనిపించింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా మూడు నెలలకు పైగా ప్రణాళిక అంటే వైసీపీ ఓటమికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే భావించాలని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరి ప్రతిపక్షాల టార్గెట్ ఎలా ఉండబోతుంది.. అధికార వైసీపీ దాన్ని ఎలా ఎదుర్కోబోతుంది? సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈసారి ఎలాంటి ఎత్తులు వేయనున్నారన్నది ముందు ముందు చూడాల్సి ఉంది.