కన్నడనాట టీడీపీ

రెండురాష్ట్రాల్లో మంచి ఊపుమీదున్న టీడీపీని ఇప్పుడు మరింత విస్తరించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఏపీలో ఎలాగూ అధికారంలో ఉంది. తెలంగాణలో మంచి పొజిషన్ లో ఉంది. దీనికి తోడు కర్ణాటకలోనూ పార్టీని విస్తరించాలని బాబు పక్కా స్కెచ్చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ వీకైపోయింది. దేవేగౌడ పార్టీకి ఏదీ కలసిరావడం లేదు. ఇక మిగిలింది బీజేపీ అది ఎలాగూ టీడీపీకి మిత్రపక్షమే. అన్నింటికి మించి కర్ణాటకలో పెద్దమొత్తంలో తెలుగు మాట్లాడేవారున్నారు. అందుకే ఇవన్నీ ఆలోచించే అక్కడ పాగా వేసేందుకు ప్లాన్ చేస్తున్నారట చంద్రబాబు.

 

ఐటీ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ఇటీవల బాబు బెంగళూరు వెళ్లారు. అక్కడ రోడ్ షో కూడా నిర్వహించారు. దానికి అక్కడ మంచి స్పందనే వచ్చింది.  కాబట్టి కర్ణాటకలో టీడీపీని విస్తరిస్తే ఎలా ఉంటుందోనని ఆరా తీశారు. కన్నడనాట ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణంలో టీడీపీ విస్తరణకు ఇదే మంచి అవకాశమని అక్కడి తెలుగువారు కూడా బాబుకు సూచించారు.  అనుకున్నదే తడవుగా వెంటనే అక్కడ టీడీపీ సభ్యత్వం చేపట్టాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారట. ఈ స్పందనను బట్టి మెల్లిమెల్లిగాపావులు కదిపేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.  ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే టీడీపీకి కర్ణాటకలో మంచి ఫ్యూచర్ తప్పక ఉంటుందని పరిశీలకుల మాట.