గోవా ముఖ్యమంత్రికి రక్షణ శాఖ బాధ్యతలు?
posted on Nov 6, 2014 7:53AM
.jpg)
ఈ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గం విస్తరించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. తనకు అత్యంత సన్నిహితుడు, గోవాలో అనేక సంస్కరణలు అమలు చేసి ప్రజలలో చాల మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొన్న మనోహర్ పారేకర్ కు రక్షణ శాఖ మంత్రిగా నియమించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న అరుణ్ జైట్లీయే రక్షణ శాఖకు కూడా మంత్రిగా పనిచేస్తున్నారు. కానీ ఒకపక్క పాకిస్తాన్, మరో పక్క చైనా దేశాల నుండి పెరుగుతున్న సవాళ్ళను ధీటుగా ఎదుర్కొనేందుకు, రక్షణ శాఖను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని కనుక దానికి ప్రత్యేకంగా మంత్రిని నియమించాలని మోడీ భావిస్తునట్లు సమాచారం. అందుకు అన్ని విధాల గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారేకర్ సమర్ధుడని మోడీ భావిస్తున్నందునే ఆయనకు ఆ కీలక బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం.
ఈసారి మంత్రివర్గ విస్తరణలో కొత్తగా మరో 12మంది మంత్రులకు మోడీ క్యాబినెట్ లోకి తీసుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల నుండి కూడా ఒక్కొకరికి మంత్రివర్గంలో చోటు దక్కవచ్చని సమాచారం. తెలంగాణా నుండి బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు, ఆంధ్రా నుండి ఒక తెదేపా నేతకు మంత్రివర్గంలో అవకాశం దక్కవచ్చని సమాచారం. అదేవిధంగా ప్రస్తుతం సహాయ మంత్రులుగా ఉన్న వాణిజ్య మంత్రి నిర్మలాసీతారామన్, సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌లకు కేబినెట్ హోదా లభించవచ్చని, మనవ వనరుల శాఖా మంత్రి స్మృతీ ఇరానిని వేరే శాఖకు మార్చవచ్చని గట్టిగా ప్రచారం జరగుతోంది.