కన్నా బాటలో ఇంకొందరు?

ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన మాజీ మంత్రి కన్నా అధికారికంగా బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు ఆధ్వర్యంలో బీజేపీ కండువా వేసుకున్నారాయన. అయితే ఆయన బాటలోనే మరికొందరు కాంగ్రెస్ నేతలున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ హైకమాండ్ తో కొందరు హస్తం సీనియర్లు సంప్రందింపులు జరిపారని సమాచారం. డైరెక్ట్ గా అమిత్ షా తోనే మాట్లాడారని తెలుస్తోంది. వారి రాకపై వెంకయ్యనాయుడు కూడా చొరవ చూపినట్టు ప్రచారం జరుగుతోంది. వారందరికీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టు చెబుతున్నారు. కన్నా సహచరులు చాలా మంది బీజేపీలో చేరబోతున్నట్టు టాక్. రాష్ట్ర విభజనకు అప్పట్లో కీలక నేతగా ఉన్న ఒకరు... అప్పటి మంత్రివర్గంలో ముఖ్య హోదాలో ఉన్న మరొకరు... పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన ఇంకొకరు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఈలిస్టులో ఉన్నారని లీకులు వస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ అయితేనే సేఫ్ అని వారంతా భావిస్తున్నారు. ఎలాగూ కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు. ఇప్పట్లో అధికారంలోకి వచ్చేంత సీనే లేదు. సమీప భవిష్యత్తులో కనీసం ప్రతిపక్షంగానైనా ఎదుగుతుందా అన్నది డౌటే. ఇవన్నీ ఆలోచించే బ్యాచ్ బ్యాచంతా కమలంలో దూకేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.