ఎన్టీఆర్ ప్రవచనాలు.. సీతయ్య బతికుంటేనా...
posted on Nov 25, 2021 11:25AM
చంద్రబాబును అన్నేసి మాటలు అన్నారు. భువనేశ్వరిని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అంబటి రాంబాబు, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, వల్లభనేని వంశీ.. ఆ నలుగురు నీచాతినీతంగా కామెంట్లు చేశారని ప్రజలంతా మండిపడుతున్నారు. భార్యపై చేసిన ఆరోపణలు తట్టుకోలేక.. వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబుపై అంతా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. నందమూరి కుటుంబం ఆసాంతం బయటకు వచ్చి.. ప్రెస్‌మీట్ పెట్టి జగన్‌రెడ్డి అండ్ బ్యాచ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే లాస్ట్ ఛాన్స్.. మీ భరతం పడతాం.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. కానీ, నందమూరి ఆవేశంలో జూనియర్ ఎన్టీఆర్ లేరు. ఆ తర్వాత తీరిగ్గా ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో చాలా సౌమ్యంగా, నీతి వ్యాఖ్యలు చెప్పారు. మరి, తోలుమందం నేతలకు ఇలాంటి సుతిమెత్తని మాటలు చెవికి ఎక్కుతాయా? తన ప్రియ మిత్రులు, సన్నిహితులుగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీలను సరిగ్గా మందలించలేదంటూ సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఎన్టీఆర్ ఏది చెప్పినా చేసే కొడాలి, వల్లభనేనిలతో క్షమాపణలు చెప్పించకపోవడంపై అంతా మండిపడుతున్నారు.
తాజాగా, నందమూరి హీరో జూనియర్ ఎన్టీయార్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీయార్ స్పందన ప్రవచనాలు చెప్పినట్లు ఉందని, ఆ వీడియో చూసి పిల్లలు కూడా నవ్వారని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీయార్ అంటే కొడాలి నానికి, వల్లభనేని వంశీకి చాలా భయమని చెప్పారు. ఎన్టీయార్ వార్నింగ్ ఇస్తే వాళ్లిద్దరూ తోకలు ముడుచుకుని పోతారని వర్ల అభిప్రాయపడ్డారు. ఎన్టీయార్ స్పందించిన తీరు చూసి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాధపడ్డారని తెలిపారు. చంద్రబాబు కుటుంబానికి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ విజయవాడలో వర్ల రామయ్య దీక్ష చేశారు.
నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదన్నారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్ విఫలమయ్యారని విమర్శించారు. మేనత్తను నోటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని వర్ల రామయ్య అన్నారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలను వదులుకుంటారా? అని నిలదీశారు.
సీతయ్య బతికుంటే...
‘‘మీ నాన్న బతికుంటే ఇంకో రకంగా ఉండేది. సీతయ్య (హరికృష్ణ) బతికుంటే నేరుగా రంగంలోకి దిగేవాడు. రచ్చ రచ్చ చేసుండేవాడు. అలా మీరు (ఎన్టీయార్) ఎందుకు చేయలేకపోయారు? మీ నాన్నకు చెల్లెలు అయినప్పుడు మీకు అత్తే కదా? మీ మేనత్తను అంటే ఇలాగేనా స్పందించేది?’’ అంటూ వర్ల రామయ్య నిలదీశారు.