వరదల్లో ముంచేశారు.. ఎన్టీఆర్ ప్రవచనాలు.. తెలుగు సీఎంలకు టెన్షన్.. టాప్ న్యూస్@1PM

వైసీపీ ప్ర‌భుత్వంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం ప్ర‌జ‌ల‌కు శాపంగా మారిందని మండిప‌డ్డారు. రెండు రోజులుగా తాను వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. ప్ర‌జ‌లు ప‌డుతోన్న క‌ష్టాల గురించి తెలుసుకున్నాన‌ని తెలిపారు. వ‌ర్షాలు ఈ ఏడాది ఎక్కువ‌గా ప‌డ‌తాయ‌ని ముందుగానే ప్ర‌భుత్వానికి తెలుస‌ని చంద్ర‌బాబు నాయుడు చెప్పారు. ముందే తెలిసినా ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉండ‌కుండా, పూర్తిగా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌ని చంద్రబాబు చెప్పారు.
-----
మాజీ సీఎం చంద్రబాబు పర్యటించబోయే ప్రాంతాల్లో హడావుడిగా నిత్యవసరాలు, రూ.2వేలు పరిహారాన్ని అధికార పార్టీ పంపిణీ చేసింది. పరిహారం పంపిణీలోనూ పార్టీల వివక్షత చూపించడం గమనార్హం. ఇతర పార్టీల వారికి పరిహారం సక్రమంగా అందలేదు. వరదల్లో ఆధార్, రేషన్ కార్డులు పోయిన వారికి పరిహారం, నిత్యవసరాలు అందలేదని తెలుస్తోంది. రూ.లక్షలు నష్టపోతే రూ.2వేలు ఎందుకని కొందరు నిరాకరించారు. చంద్రబాబు పర్యటన ప్రాంతాల్లో హడావిడిగా పారిశుద్ద్య పనులు చేపట్టారు.
-----
చంద్రబాబు నాయుడు సతీమణిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన అనంతపురం తెలుగు బీసీ మహిళా నేతల్ని పోలీసులు వేధించటం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బూతులు మాట్లాడిన  వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను వదిలేసి బూతులు మాట్లాడొద్దన్నందుకు తెలుగు మహిళలను వేధిస్తారా అని ప్రశ్నించారు.  వారు చేసిన తప్పేంటి?... వైసీపీ నేతలు మహిళలను అసభ్యంగా మాట్లాడుతుంటే సాటి మహిళలుగా స్పందించటం తప్పా అని నిలదీశారు
--------
నందమూరి హీరో జూనియర్ ఎన్టీయార్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్ విఫలమయ్యారని విమర్శించారు. మేనత్తను నోటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని వర్ల రామయ్య తెలిపారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలలను వదులుకుంటారా? అని వర్ల రామయ్య నిలదీశారు
-----
జూనియర్ ఎన్టీఆర్‌పై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ అని టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా అన్నారు. చంద్రబాబు కుటుంబానికి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ విజయవాడలో వర్ల రామయ్య చేస్తున్న దీక్షకు టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బుద్దావెంకన్న, నాగుల్ మీరా మాట్లాడుతూ... జూనియర్‌పై తమ మనసులో ఉందే... వర్ల రామయ్య బయటపెట్టారన్నారు. జూనియర్ వ్యాఖ్యలు చూసి వైసీపీ నాయకులు ఏంటి జూనియర్ ఇలా మాట్లాడారు అని అనుకుంటున్నారని తెలిపారు. 
-----
తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెగ్యులర్ మెడికల్ టెస్ట్‌లో భాగంగా బుధవారం రాత్రి ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే స్పీకర్ ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యానని తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు, సన్నిహితులు వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకుని, హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు.
---------
వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 3గంటల దీక్ష చేసి ఢిల్లీకి పోయాడని ఎద్దేవా చేశారు. తాడోపేడో తేల్చుకుంటానని చెప్పాడన్నారు. మొత్తానికి KCR కథ 3 ఏళ్లు కర్రసాము నేర్చి మూలన కూర్చొన్న ముసల్దాన్ని కూడా కొట్టలేని తీరు అయిందంటూ షర్మిల  సెటైర్ వేశారు. ఢిల్లీకి పోయి పొడుస్తమ్ అని ప్రెస్ మీట్‌లు పెట్టిన దొర ఉత్తి చేతులతో తిరిగొచ్చాడని కామెంట్ చేశారు.
--------
ప్రముఖ సింగర్ హరిణి తండ్రి, సుజనా ఫౌండేషన్ సీఈవోగా ఉన్న ఏ.కే.రావు అనుమానాస్పద స్థితిలో బెంగళూరులో మరణించారు. ఆయన మృతదేహం బెంగళూరులోని ఓ రైల్వే ట్రాక్‌పై గుర్తించారు. ఏకే రావు తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.  గత వారం రోజులుగా ఏకే రావు కుటుంబ సభ్యులతో సహా అదృశ్యమయ్యారు. ఎక్కడికి వెళ్లారో స్పష్టత లేదు. కానీ హఠాత్తుగా ఆయన మృతదేహం రైలు పట్టాలపై కనిపించింది. 
--
శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఆరోగ్య ప‌రిస్థితిపై సినీ న‌టుడు సోనూసూద్ ఆరా తీశారు. శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుమారుడు అజ‌య్‌తో ఆయ‌న‌ మాట్లాడారు. ఆరోగ్య ప‌రిస్థితి గురించి తెలుసుకుని ప‌రామ‌ర్శించారు. మ‌రోవైపు,  తాను శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబంతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాన‌ని, ఆయ‌న‌ ప్రాణాలు కాపాడడానికి చేతనైన సాయం చేస్తానని సోనూసూద్ ట్వీట్ చేశారు.  
---
దేశీయంగా నిర్మించిన ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామి ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ సమక్షంలో గురువారం భారత నావికాదళంలోకి ప్రవేశించింది.ఈ జలాంతర్గామిని ముంబయికి చెందిన మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ ఫ్రాన్స్‌కు చెందిన నావల్ గ్రూప్‌తో కలిసి నిర్మించింది.గతంలో తయారు చేసిన కల్వరి, ఖండేరి, కరంజ్ జలాంతర్గాములను ఇప్పటికే ప్రారంభించారు.ఐఎన్ఎస్ అవతార్ 1973 ఆగస్టు 31వతేదీన ప్రారంభించిన తర్వాత 37 సంవత్సరాల పాటు దేశానికి గొప్ప సేవలు అందించింది

Online Jyotish
Tone Academy
KidsOne Telugu