టీడీపీలో... కార్యకర్తలు వర్సెస్ కార్పోరేట్స్!


ఒక పార్టీ వ్యవసాయ క్షేత్రమైతే... దాన్లోని మొక్కలు కార్యకర్తలు! క్షేత్రం, దాంట్లో మొక్కలు వుంటేనే యూరియా లాంటి మందులు అవసరం అవుతాయి! ఇంతకీ పొలిటికల్ పార్టీల్లో యూరియా ఏంటో తెలుసా? బడా బడా కార్పోరేట్లు ఇచ్చే పార్టీ ఫండ్స్! అవ్వి అవసరమే... కాని, అసలు పొలమూ, మొక్కలు వుంటే కదా, మందుతో పని! ఇప్పుడు ఇదే టీడీపీ తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది... 


మహోన్నత నాయకుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కూడా కార్యకర్తల పార్టీయే. ఎందరో కొత్త నేతల్ని తెలుగు రాష్ట్రాలకి అందించింది కూడా టీడీపీయే. ఇది సాధ్యమవ్వటానికి కారణం మొదట ఎన్టీఆర్ , తరువాత చంద్రబాబు నిజాయితీగా జెండాలు ఎత్తిన కార్యకర్తల్ని ఎంకరేజ్ చేయటమే. తెలుగు దేశంలో కింది స్థాయి వర్కర్ల దగ్గర నుంచీ అన్ని స్థాయిల వారికి దొరికినంత ప్రొత్సాహం మరే పార్టీలోనూ దొరకదన్నది నిజం. ప్రత్యక్ష నిదర్శనం...


పాతికేళ్ల ప్రస్థానంలో ఎక్కడా ఎప్పుడూ కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేయని టీడీపీ ఇప్పుడు కార్పోరేట్ ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఇందుకు చక్కటి ఉదాహరణ ప్రస్తుతం పార్టీలో అలజడి రేపుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారమే. జనవరి తరువాత ఏ క్షణాన్నైనా జరగనున్న నెల్లూరు, ప్రకాషం, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక టగ్ ఆఫ్ వార్ కి కారణమవుతోంది. ఒకవైపు సంవత్సరాలుగా పార్టీని నమ్మకున్న కార్యకర్తలు, నేతలు వుంటే... మరో వైపు అమాంతం వచ్చిపడ్డ కార్పోరేట్ శక్తులు వున్నాయి. నిజానికి ఎమ్మెల్సీ ఎన్నికల టికెట్ చంద్రబాబు, లోకేష్ లు కార్యకర్తల్లోనే ఎవరికైనా ఒకరికి ఇవ్వాలని భావించారు. గెలిచే వ్యక్తులపై దృష్టి కూడా సారించారు. కాని, అంతలోనే టీడీపీకి ఈ మధ్య అత్యంత కీలకమైన కార్పోరేట్ నేతలు రంగంలోకి దిగారు. ప్రతీ విషయంలో జోక్యం చేసుకున్నట్టే ప్రకాషం, నెల్లురు, చిత్తూరు జిల్లాల నియోజక వర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో కూడా తమ ప్రభావం చూపారు. అధ్యక్షుల వారికి ఇష్టం లేకున్నా , లోకేష్ బాబు కూడా అంగీకరించకున్నా తమ వారికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో వున్నారు. తమ కార్పోరేట్ ధన బలంతో తాము నిలబెట్టిన అభ్యర్థి గెలిచేస్తాడని వారి ధీమా!


పట్టభద్రుల ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరగవు కాబట్టి గ్రాడ్యుయేట్స్ ని డబ్బు పెట్టి ఇన్ ఫ్లుయెన్స్ చేయటం అనుకున్నంత ఈజీ కాదు. క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్ పని చేస్తే ఓట్లు పడతాయి. అయినా కూడా పెద బాబు, చిన బాబుల్ని ఈ కార్పోరేట్ శక్తులు నిజమైన కార్యకర్తకు టికెట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నాయి. వాళ్ల మాటలు సీఎం వినరనే ప్రస్తుతానికి నెల్లురు, ప్రకాషం, చిత్తూరు జిల్లాల టీడీపీ తమ్ముళ్లు భావిస్తున్నారు!


అతి త్వరలో ఎదురవనున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త నాయకత్వాన్ని సృష్టించుకునేందుకు పార్టీకి మంచి అవకాశం. ఇలాంటి ఒక ప్రయోగం సాధారణ ఎన్నికల్లో, ప్రజలంతా ఓటు వేసే సమయంలో చేయలేము. కాబట్టి చంద్రబాబు సరైన నిర్ణయం సాహసంగా తీసుకుంటేనే బావుంటుంది. అలా కాక కార్పోరేట్ శక్తులకి ప్రసన్నమై వారు చెప్పిన అబ్యర్థిని నిలబెడితే... వర్కర్లకి తప్పుడు సంకేతాలు వెళతాయి. మిగతా పార్టీల్లాగే టీడీపీలో కూడా జెండాలు మోయకుండా కార్పోరేట్ ఎజెండా పెట్టుకుని పని చేస్తే సక్సెస్ వస్తుంది అనుకుంటారు! ఇది దీర్ఘ కాలంలో చంద్రబాబుతో పాటూ యువనేత లోకేష్ కి కూడా ప్రమాదం. ఎందుకంటే, మొదట్లోనే చెప్పుకున్నాం కదా... పార్టీ పొలం. కార్యకర్తలు మొక్కలు. కార్పోరేట్ శక్తులు కేవలం పురుగు మందులు! అంతే ...