కొత్త జిల్లాల లెక్కలు..పాస్‌పోర్ట్ తిప్పలు

పరిపాలనా సౌలభ్యం కోసం..ప్రజలకు సంక్షేమ ఫలాలు మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు.  కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పరిపాలనా సంస్కరణగా చెప్పుకుంటున్న ఈ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజలకు అప్పుడే చుక్కలు చూపెడుతోంది. జిల్లాలు ఏర్పడి నెల రోజులు కావొస్తున్నప్పటికి పాస్‌పోర్ట్‌ సంబంధిత సేవలు ఇంకా పట్టాలెక్కలేదు. విద్య, ఉపాధి అవసరాల నిమిత్తం తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇందుకోసం దరఖాస్తు చేసుకునేవారు పెరుగుతున్నారు.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, కొత్త రాష్ట్రంలోనూ ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగింది.  కాని కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత మాత్రం ఈ ప్రక్రియ నత్త నడకన సాగుతోంది. ఇప్పటిదాకా ఎవరు ఏ జిల్లా కిందకు వస్తారో అర్థంకాలేదు. పాస్‌పోర్టు దరఖాస్తులను పాత జిల్లాల అధికారుల వద్దకు తీసుకెళితే, కొత్త జిల్లాల అధికారుల వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు. తీరా గంపెడాశతో కొత్త జిల్లాల అధికారుల వద్దకు వెళితే, ఇంకా సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రాలేదని, మరో రెండు వారాలు పడుతుందని చెబుతున్నారు. దీంతో మధ్యలో విదేశాలకు వెళ్లాల్సిన ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది గల్ఫ్‌లో ఉపాధి అవకాశాలను కూడా కోల్పోతున్నారు.

 

ఇటీవల రెండు జిల్లాల ఎస్పీలు ఎండార్స్ చేసి పంపించినా, కొత్త జిల్లా నుంచి దరఖాస్తు రాలేదన్న కారణంతో పాస్‌పోర్ట్‌ను తిరస్కరించిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. పాస్‌పోర్ట్‌లకు సంబంధించిన నివేదికను ఎస్పీలు ఆన్‌లైన్‌లోనే పంపించాలి. సంబంధిత సాఫ్ట్‌వేర్ రాకపోవడంతో కొత్త జిల్లాల ఎస్పీలు రిపోర్టులు పంపించలేకపోతున్నారు. పాత జిల్లాల ఎస్పీలు మాకు సంబందం లేదంటున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ నుంచి కొత్త జిల్లాల ఎస్పీలకు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అందలేదు. అది వస్తే తప్పితే, ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ దరఖాస్తులను పరిష్కరించడం సాధ్యం కాదు. అయితే న్యూఢిల్లీ నుంచి రెండు, మూడు వారాల్లో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ పంపుతామని విదేశాంగశాఖ అధికారులు చెప్తున్నారు.