తెదేపా ఎదురు దాడితో ఆత్మ రక్షణలో పడిన తెరాస

 

రాష్ట్ర విభజనపై నిర్దిష్టమయిన అభిప్రాయం చెప్పలేక సతమతమవుతున్నతెదేపాపై ఇదే అదునుగా అన్ని రాజకీయ పార్టీలు దాడి ప్రారంభించాయి. ముఖ్యంగా తెరాస నేతలు హరీష్ రావు తదితరులు శాసనసభ, మండలిలో తెదేపా అనుసరించిన ద్వంద వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్ననేపద్యంలో వారిని తక్షణమే ఎదుర్కొనవలసిన అవసరం ఏర్పడింది. తెదేపా తెలంగాణా నేతలు మోత్కుపల్లి నరసింహులు, ఎర్రబెల్లి దయాకర రావు తెరాసపై ఎదురుదాడి ఆరంబిస్తూ, అసలు తెరాసకు నిజంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలనే కోరిక ఉంటే, తెరాసను వెంటనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తెలంగాణా ఏర్పాటుకి సహకరించాలని కోరారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ఏర్పాటుకి సంసిద్దత వ్యక్తం చేస్తున్నపటికీ, తెరాస విలీనానికి అంగీకరించనందునే ఏవో కుంటి సాకులు చెపుతూ విభజన ప్రక్రియను సాగదీస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటన చేసిన వెంటనే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఉండి ఉంటే, ఈ పాటికి తెలంగాణా రాష్ట్రం కూడా ఏర్పడి ఉండేదని వారు అన్నారు. అందువల్ల ఇప్పటికయినా తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తెలంగాణా ఏర్పాటుకు సహకరించాలని, లేకుంటే ప్రజలు తెరాసను క్షమించబోరని వారు హెచ్చరించారు.

 

తెరాస తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇస్తుందో లేక తెలంగాణా ప్రజల ఆకాంక్షకే ప్రాధాన్యత ఇస్తుందో తెలపాలని వారు కోరారు. ఈ ఎన్నికలలోగా రెండు పార్టీల విలీనం జరుగకపోయినట్లయితే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఏర్పాటుని వాయిదా వేసే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పడకపోతే ఆ తరువాత పరిస్థితుల గురించి ఎవరూ చెప్పలేరని వారు అన్నారు. నాలుగు కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేందుకు, తెరాస వెంటనే కాంగ్రెస్ విలీనం చేసి, రాష్ట్ర ఏర్పాటుకి సహకరించాలని వారు డిమాండ్ చేసారు.

 

ఈవిధంగా తెదేపా ఎదురుదాడి మొదలుపెట్టడంతో తెరాస ఆత్మరక్షణలో పడింది. తెరాస కాంగ్రెస్ లో విలీనం కాకపోవడం వలననే తెలంగాణా ఏర్పాటు అవడం లేదని ప్రజలు కూడా నమ్మినట్లయితే ఆ పార్టీకి చాలా ప్రమాదమే.