పులిని చూసి వాతలు పెట్టుకొన్నట్లు...టీ-కాంగ్రెస్ నేతలు
posted on Jun 1, 2014 11:38AM
.jpg)
సీమాంధ్రాలో కాంగ్రెస్ పార్టీని పణంగా పెట్టి మరీ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో గెలవలేకపోయింది. అందుకు ప్రధాన కారణం టీ-కాంగ్రెస్ నేతలు ఎవరికీ వారు తమ స్వార్ధం చూసుకొన్నారే తప్ప, ఎన్నికలలో పార్టీని గెలిపించుకోవాలని గట్టిగా ప్రయత్నించక పోవడమే. అందుకు మరో బలమయిన కారణం కూడా ఉంది. తమను నట్టేటముంచిన కేసీఆర్ ను టీ-కాంగ్రెస్ నేతలందరూ కలిసి కట్టుగా గట్టిగా ఎదుర్కొనే బదులు, ఆయన వ్యూహాలనే గుడ్డిగా అనుసరించే ప్రయత్నం చేసారు. హైదరాబాదులో సెటిలర్లు, సీమాంధ్ర ప్రభుత్వోద్యోగులకు మొదట అండగా నిలబడిన టీ-కాంగ్రెస్ నేతలు, ఆ తరువాత కేసీఆర్ వారిపై దాడి తీవ్రతరం చేసిన్నపుడు, వారికి అండగా నిలబడే ప్రయత్నం చేయలేదు. వారికి అండగా నిలబడినట్లయితే తెలంగాణా ప్రజల ఓట్లు కోల్పోతామనే భయంతో వారిని విడిచి పెట్టేసారు. మునుపటిలా వారి భద్రతకు భరోసా ఇస్తూ గట్టిగా మాట్లాడలేదు. అందుకే వారి పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా తయారయి, చివరికి ఘోర పరాజయం పొందారు.
కనీసం తమ ఓటమి నుండి అయినా పాటాలు నేర్చుకొని, తమ తప్పులను తెలుసుకొని సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అదీ లేదు. మళ్ళీ అవే తప్పులు చేసేందుకు సిద్దపడుతున్నారు. పోలవరం ముంపు గ్రామాల విషయంలో కేసీఆర్ తెలంగాణా బంద్ కు పిలుపునిస్తే దానిపై ఏవిధంగా ప్రతిస్పందించాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయారు టీ-కాంగ్రెస్ నేతలు.
అయితే కేసీఆర్ మరియు తెరాస నేతలు ఈ అంశంపై కూడా తమకంటే ముందుకు దూసుకుపోతుండటం చూసి, టీ-కాంగ్రెస్ నేతలు తాము కూడా పోలవరం ముంపు గ్రామాలపై ఉద్యమించాలని నిశ్చయించుకొన్నారు. టీ-పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో నిన్న సమావేశమయిన టీ-కాంగ్రెస్ నేతలందరూ, పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడాన్ని వ్యతిరేఖించాలని నిర్ణయం తీసుకొన్నారు. త్వరలో వారిలో కొందరు నేతలు ముంపు గ్రామాలను స్వయంగా సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి తరపున తాము పోరాడుతామని దైర్యం చెప్పాలని కూడా నిర్ణయించుకొన్నారు.
అయితే ఈ ఆత్రుతలో టీ-కాంగ్రెస్ నేతలు ఒక ముఖ్యమయిన విషయాన్ని మరిచిపోయినట్లున్నారు. రాష్ట్ర విభజన కారణంగా ఆగ్రహంతో ఉన్నసీమాంధ్రులను శాంతింపజేసేందుకే, కాంగ్రెస్ అధిష్టానం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ కు బదలాయించేందుకు ఆర్డినెన్స్ సిద్దం చేసింది. కానీ సమయాభావం వల్ల ఆ ఆర్డినెన్స్ కు ఆమోదముద్ర వేయించలేకపోయింది. అటువంటప్పుడు, టీ-కాంగ్రెస్ నేతలు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లు పోలవరం అంశంపై తెరాస నేతల వ్యూహాలను గుడ్డిగా అనుకరిస్తే వారే నవ్వులపాలవడం ఖాయం.