మేకపాటికి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నాయకత్వం
posted on Jun 1, 2014 11:03AM

వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా నెల్లూరు ఎంపి, జగన్‌కి మొదటి నుంచీ అండగా వున్న మేకపాటి రాజమోహన్ రెడ్డి ‘ఎంపి’కయ్యారు. పార్లమెంట్‌లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా అరకు ఎంపి కొత్తపల్లి గీత, కార్యదర్శిగా ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోశాధికారిగా కర్నూలు ఎంపి బుట్టారేణుక, విప్‌గా ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. వీరి పేర్లను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. శనివారం పార్టీ సమావేశం జరిగిన అనంతరం పార్లమెంటులో వైసీపీని ముందుకు నడిపించే నాయకుల పేర్లతోపాటు తెలంగాణ అసెంబ్లీలో వైసీపీ వాణి వినిపించే నాయకుల పేర్లను కూడా ప్రకటించారు. అలాగే మరికొన్ని బాధ్యతలు ఎవరెవరికి అప్పగించిందీ ప్రకటించారు. పార్టీ అధికార జాతీయ ప్రతినిధులుగా తిరుపతి ఎంపి వి వరప్రసాదరావు, కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపి పివి మిథున్ రెడ్డిని నియమించారు. తెలంగాణ అసెంబ్లీ వైఎస్‌ఆర్‌సిపి శాసనసభాపక్ష నేతగా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఉప నేతగా పాయం వెంకటేశ్వర్లు, విప్‌గా మదనలాల్ నాయక్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వానికి అంశాల వారీగా తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వాన్ని అదే పనిగా విమర్శించడం తమ పనికాదని, ప్రజలకు ఉపయోగపడే పనిచేస్తే ఆహ్వానిస్తామన్నారు. ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగితే మాత్రం వ్యతిరేకిస్తామన్నారు.