స్పీకర్ పదవికి తమ్మినేని మచ్చ .. మహానాడుపై అనుచిత వ్యాఖ్యలతో బరితెగింపు!

స్పీకర్ పదవికి ఒక గౌరవం ఉంటుంది. ఆ పదవిలో ఉన్న వారు రాజకీయాలు మాట్లాడరు. తాము గెలిచి వచ్చిన పార్టీ కార్యక్రమాలలో పాల్గొనరు. బాధ్యత గలిగిన రాజ్యాంగ పదవుల్లో ఉన్న ఎవరైనా పాటించాల్సిన నైతికత ఇది. అలాంటి బాధ్యత కలిగిన రాజ్యంగ పదవిలో ఉన్న తమ్మినేని ఆ గౌరవానికి తగరని తన వ్యాఖ్యలతో నిరూపించుకున్నారు.

తెలుగుదేశం మహానాడుపై అనుచిత వ్యాఖ్యలతో బరితెగించి స్పీకర్ పదవికి మాయని మచ్చ తీసుకొచ్చారు. మహానాడును వల్లకాడనీ, చచ్చిపోయిన పార్టీకి దహన సంస్కారాలు చేస్తున్నారనీ సంస్కార హీనమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్కార్ పై పెల్లుబుకుతున్న వ్యతిరేకతతో వైసీపీ నేతలలో గుబులు పెరుగుతోంది. ఫ్రస్ట్రేషన్ తో ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. బాలినేని సభ్య సమాజం వినడానికి కూడా ఇష్టపడని పదజాలంతో దేశం నేతలను దూషించడం ఇందులో భాగంగానే చూడాలి. అదే ఫస్ట్రేషన్ తో స్పీకర్ పదవికే తలవంపులు తెచ్చేలా  తమ్మినేని వ్యాఖ్యలు చేశారు.  గడప,గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసిపి మంత్రులు,ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలింది. మా గడపకు రావద్దంటూ జనం మొహంమీదే చెప్పేశారు.

మూడేళ్ళుగా ఏం చేశారు?ఎందుకొచ్చారు అంటూ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు.  మా ఇంటికి రావద్దు,మీ పథకాలకు,మీకో  నమస్కారం అంటూ ప్రజలు తిరగపడటంతో పధకాల ప్రచారం ఆపేసి   బస్సు యాత్రతో సిగ్గు దాచుకునేందుకు వైసీపీ నాయకులు రెడీ అయిపోయారు.  రాష్ట్రంలో ప్రజలు ఎదోర్కొంటున్న సమస్యలు పరిష్కరించలేక  ప్రజల దృష్టిని మరల్చేందుకే తెలుగుదేశం పార్టీ మహానాడు ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారనడంలో సందేహం లేదు. గెలిచినప్పుడు పొంగిపోవడం, పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడు కుంగిపోవడం కాకుండా రెంటినీ సమానంగా స్వీకరించే హుందాతనం నేతలలో ఉండాలి.

కానీ వైసీపీ నేతలలో అది కనిపించడంలేదు. విజయంతో అహంకారం తలకెక్కి ఇష్టారీతిన వ్యవహరించడం, పరిస్థితులు ప్రతికూలంగా మారగానే సంయమనం కోల్పోయి రాజకీయ ప్రత్యర్థి పార్టీల నేతలపై నోరు పారేసుకోవడం ఏ విధంగా చూసినా సమర్ధనీయం కాదు.    తమ్మినేని మాటలు, బాలినేని బూతులు వైసీపీలో ఓటమి భయానికి నిదర్శనాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.