మోడీ కేసీఆర్ కుమ్మక్కు రాజకీయాలు- పైపై విమర్శలతో జనం దృష్టి మళ్లించే యత్నాలు!

రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. కానీ దొంగ శత్రువులు ఉంటారా అంటే మాత్రం కచ్చితంగా ఉంటారంటూ మోడీ, కేసీఆర్ లను చూపుతున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తే కేసీఆర్ నగరం విడిచి వెళ్లడం రాజకీయ కుమ్మక్కులో భాగమేనంటున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న మోడీ నినాదాన్ని కేసీఆర్ అందిపుచ్చుకుని దానిని తెలంగాణకు అనుగుణంగా కాంగ్రెస్ ముక్త తెలంగాణగా సవరించుకున్నారని, ఆ లక్ష్యం సాధించేందుకే బీజేపీకి రాష్ట్రంలో లేని ప్రాధాన్యతకు కట్టబెడుతున్నారన్నది వారి విశ్లేషణ. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలం చెక్కు చెదరకపోవడం, నేతలు బలహీనపడినా కార్యకర్తల బలం తెలంగాణలో కాంగ్రెస్ కు ఎలా ఉన్నది అలాగే ఉండటాన్ని వారు ఎత్తి చూపుతున్నారు.  

ఈ నేపథ్యంలోనే రెండు ధఫాలు వరుసగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తీవ్రమైన యాంటీ ఇన్ కంబెన్సీని ఎదుర్కొంటోందనీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు మళ్ల కుండా ఉండాలంటే బీజేపీ బలోపేతం అయ్యిందన్న భావన ప్రజలలో కలిగించేందుకే ఆ పార్టీకి అధిక ప్రాధాన్యతను కేసీఆర్ ఇస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.  కేంద్రం అవినీతి వైఫల్యాలపై కేసీఆర్ గళమెత్తడం, కేసీఆర్ కుటుంబ అవినీతిపై బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించండం రెండు పార్టీల రాజకీయ నాటకంలో బాగమేనని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిజంగా కేసీఆర్ అవినీతి నిగ్గు తీయాలంటే ఎంత సేపని వారు ప్రశ్నిస్తున్నారు.

 తాజాగా కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ పై మనీ లాండరింగ్ కేసులో ఈడీ చార్జిషీట్ దాఖలు చేసిందనీ, అలాగే  జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావలసిందిగా  జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ నో్టీసులు జారీ చేసింది.   తాజాగా మహారాష్ట్ర మంత్రి శివసేన నేత అనిల్‌ పరబ్‌ నివాసాలపై ఈడీ దాడులు నిర్వహించి మనీలాండరింగ్ లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. బీజేపీ రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ దాడుల పరంపర కొనసాగుతుంటే ..   స్వయంగా మోడీయే కేసీఆర్ అవినీతి, ఆయన కుటుంబ దోపిడీపై విమర్శలు, ఆరోపణలు  గుప్పిస్తుంటే ఈడీ ఎందుకు దాడులు చేయడం లేదని, సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఎందుకు ఆదేశించడం లేదనీ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. మోడీ కేసీఆర్ పై విమర్శలు గుప్పించినా, కేసీఆర్ కేంద్రంపై, ప్రధానిపై ఆరోపణలు సంధించినా.. అదంతా రాజకీయ క్రీడలో భాగమే తప్ప నిజం కాదన్న సంగతిని బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.

తెలంగాణలో తెరాసకు, కేంద్రంలో బీజేపీకి నిజమైన ప్రత్యర్థి కాంగ్రెస్ అన్న అవగాహనతోనే కేసీఆర్, మోడీలు ఆ పార్టీని తగ్గించి చూపేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మొత్తం మీద రాష్ట్రంలో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకే కేసీఆర్, మోడీ రాజకీయ ప్రత్యర్థులుగా ప్రజలకు బిల్డప్ ఇస్తున్నారని వారు అంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశం అన్న అంశం కూడా అంతిమంగా మోడీకి మేలు చేసేందుకేనని అంటున్నారు. మూడో ఫ్రంట్, కూటమి అంటూ కేసీఆర్ కలుస్తున్న ప్రాంతీయ పార్టీల రాజకీయ మూడ్ ఏమిటన్నది బీజేపీ అగ్రనాయకత్వానికి చేరవేసే వ్యూహంలో భాగమే కేసీఆర్ పర్యటనలని వారు విశ్లేషణలు చేస్తున్నారు. గురువారం తెలంగాణ పర్యటనలో భాగంగా మోడీ బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభలో కేసీఆర్ కుటుంబ అవినీతిపై చేసిన విమర్శలను  తెలంగాణ బీజేపీ నాయకలే సీరియస్ గా తీసుకోవడం లేదని ఆ పార్టీకి సన్నిహితంగా ఉండే వర్గాలు చెబుతున్నాయి.