జయ మీద పదేళ్ళ బ్యాన్
posted on Nov 13, 2014 1:37PM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష, జరిమానా పడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం బెయిల్ మీద బయటకి వచ్చారు. ఈ కేసులో శిక్ష పడిన పుణ్యమా అని ఆమె తన ముఖ్యమంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు. ఇప్పుడు తమిళనాడులో జయలలిత పార్టీ అధికారంలో వున్నప్పటికీ, జయలలిత మాత్రం పదవికి దూరంగా వుండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జయలలిత పార్టీ ప్రభుత్వమే జయలలిత పదేళ్ళపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. చట్టప్రకారం ఇది తప్పని చర్య కావడంతో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. జయలలితపై అనర్హత వేటు సెప్టెంబర్ 27, 2014 నుంచి అమల్లోకి వచ్చినట్లు గెజిట్ నోటిఫికేషన్‌లో తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ నంబర్ 8 ప్రకారం అనర్హత వేటు వేశారు. జయలలిత మీద పది సంవత్సరాలు అనర్హత వేటు వేయడం అంటే, ఆమె రాజకీయ ప్రస్థానం ముగిసినట్టుగా భావించవచ్చు.