తమిళనాడులో "చంద్ర" మాయ..

చంద్రబాబు డైరెక్షన్‌లో కరుణానిధి పనిచేయడమేంటి అనుకుంటున్నారా..ఎంటి ఈ ట్విస్ట్ అని బుర్రలు బాదుకోకండి అక్కడికే వస్తున్నాం..ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మినహా మిగిలిన చోట్ల అధికారం మారుతుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెబుతున్నాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. అంటే అక్కడ అధికారంలో ఉన్న జయలలితకు అధికారం దూరమై..డీఎంకే అధినేత కరుణానిధి సీఎం కాబోతున్నట్టే కదా...! జయలలిత అభివృద్ధిని, ఎన్నికల్లో ఆమె ఆల్‌ఫ్రీ వాగ్దానాన్ని కూడా కాదని ఓటర్లు డీఎంకే వైపు మొగ్గు చూపేలా కరుణ ఏం మాయ చేశారు? అంటే దానికి సమాధానం "రుణమాఫీ" .

 

రెండేళ్ల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని వైసీపీకే గెలుపు అవకాశాలున్నాయని స్పష్టంగా కనిపించాయి. అయితే రాజకీయ చాణుక్యుడిగా పేరొందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రుణమాఫీ అస్త్రాన్ని వదిలారు. ఈ అస్త్రం దాటికి వైసీపీ కకావికలమై పోయి, టీడీపీని అధికారంలో కూర్చోబెట్టి.. బాబును ముఖ్యమంత్రిని చేసింది. అచ్చం ఏపీ లాంటి పరిస్థితులే తమిళనాట కూడా కనిపించాయి.  జయలలిత ప్రభంజనం ఖాయమని అందరూ భావిస్తున్న తరుణంలో చివరి నిమిషంలో కరుణానిధి, "చంద్రబాబు రుణమాఫీ" అస్త్రాన్ని ప్రజలపై వదిలారు. ఈ అస్త్రమే ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారిందని, అమ్మను కాదని కరుణపై ఓటర్లు "కరుణ" చూపేందుకు కారణమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఎగ్జిట్‌పోల్స్ నిజమవుతాయా..చంద్రబాబు "మంత్రదండం" బాగా పనిచేసిందా అన్నది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.