రెండు డోసులు తీసుకుంటే సేఫ్..
posted on Apr 29, 2021 4:28PM
అది భూకంపం కంటే భయంకరమైనది. తుపాన్ కంటే ప్రమాదకరమైంది. టెర్రరిస్టుల చేతిలో ఉన్న బాంబ్ కంటే బలమైంది...అది ఏంటని అనుకుంటున్నారా..? అదే కరోనా మృతువు. కరోనా వస్తే కనికరం ఉండదు. బంధాలు, అనుబంధాలు, బంధువులుండవ్.. అన్నీ అనాధశవాలే. ఒక రోజు కాదు. రెండు రోజులు కాదు. సరిగ్గా సంవత్సరం నుండి ప్రపంచదేశాలను వణికిస్తోంది. సినిమాలో దెయ్యం లా దేశాలను పట్టి పీడిస్తుంది. ఇప్పుడు ప్రపంచదేశాలు ఆ మహమ్మారికి మరణ ముహూర్తం పెట్టడానికి ట్రై చేస్తున్నారు. భారత దేశం లో కరోనా బ్రేక్ లేని ఆర్టీసీ బస్సు లా దూసుకుపోతుంది. నిర్లక్ష్యం తో వుంటే అంతే, కరోనా ఒక్కసారి ఎటాక్ చేసిందంటే డైరెక్ట్ టికెట్ స్వర్గపురికే. కరోనా ముదిరాక తప్పకుండ బకెట్ తన్నాల్సిందే. అందుకే దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్ ని రంగంలోకి దించింది.. కరోనాకు వ్యాక్సిన్ రూపం లో బ్రేక్ వేస్తుంది. దేశం లో ఉన్న ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండ వ్యాక్సిన్ వేసుకోవాలి.
అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఆసక్తికర వివరాలు వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టయితే, పాజిటివ్ వచ్చినా ఆసుపత్రిలో చేరాల్సినంత తీవ్రత ఉండదని సీడీసీ తెలిపింది. మరణం నుంచి తప్పించుకోవచ్చని తెలిపింది. 65 ఏళ్లకు పైబడిన వారు రెండు డోసులు తీసుకున్న అనంతరం, వారికి 94 శాతం రక్షణ ఉంటుందని చెప్పింది. ఒక డోసు తీసుకుంటే 64 శాతం రక్షణ కలుగుతుందని వెల్లడించింది. టీకా తీసుకున్న వారు కరోనా వైరస్ ను సాధారణ జలుబులాగానే ఎదుర్కొంటారని సీడీసీ వివరించింది.
ఈ అధ్యయనం కోసం సీడీసీ నిపుణులు అమెరికాలోని 417 మంది కరోనా రోగుల సమాచారాన్ని, 187 మంది వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తుల ఆరోగ్యపరిస్థితితో పోల్చి చూశారు. అమెరికాలో ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. సీడీసీ తాజా అధ్యయనంతో ఈ రెండు వ్యాక్సిన్ల సమర్థతపై మరింత సానుకూలత బలపడింది. దీనిపై సీడీసీ డైరెక్టర్ రోషెల్లే వాలెన్ స్కై స్పందిస్తూ.... వ్యాక్సినేషన్ వల్ల కరోనా రోగులు ఆసుపత్రుల పాలయ్యే ముప్పు తప్పుతుందని, తద్వారా ఆసుపత్రులు నిండిపోయే అవకాశం ఉండదని వివరించారు. ఈ నేపథ్యంలో, సాధ్యమైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
అటు, బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాలు కూడా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో అధ్యయనం చేపట్టాయి. ఇజ్రాయెల్ లో వృద్ధులకు వ్యాక్సిన్లు పూర్తి రక్షణ కల్పిస్తున్నాయని తేలింది. అటు, బ్రిటన్ లో కరోనా టీకా ఒక డోసు వేసుకున్నా 50 శాతం రక్షణ కలిగిస్తున్నట్టు గుర్తించారు.