పార్టీలో హద్దు దాటితే చర్యలు తప్పవు...టీ బీజేపీ చీఫ్ హెచ్చరిక
posted on Jul 21, 2025 6:37PM

భారతీయ జనతా పార్టీలో అంతర్గత పోరుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పందించారు. తమ అంతర్గత వ్యవహారాలు తామే పరిష్కరించుకుంటామని తెలిపారు. టీ బీజేపీ చీఫ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో కేటీఆర్-కవిత కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి- కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య కుడా అంతర్గత విభేదాలు ఉన్నాయని గుర్తు చేశారు. పార్టీలో హద్దు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలవనున్నారు. తెలంగాణలో రాజకీయ వ్యూహాలు, స్థానిక ఎన్నికల సన్నాహాలు, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. మతపరమైన రిజర్వేషన్లను భారతీయ జనతా పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తుందని మరోసారి స్పష్టం చేసారు. బీసీలకు 42% రిజర్వేషన్లను సమర్థిస్తుందని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ బిల్లులో ముస్లిం రిజర్వేషన్లను చేర్చి ఓబీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.
బీజేపీ మాత్రమే బీసీలకు న్యాయం చేయగలదని, మతపరమైన రిజర్వేషన్లు లేకుండా రిజర్వేషన్లు కల్పించాలని టీ బీజేపీ ఛీప్ తెలిపారు .ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ హైకమాండ్ సానుకూలంగా స్పందిస్తాయని ధీమా వ్యక్తం చేసారు. తెలంగాణలో బీసీలకు న్యాయం చేయడానికి బీజేపీ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.