ఏపీ అసెంబ్లీలో రెండో రోజూ సస్పెన్షన్ల పర్వం
posted on Sep 22, 2023 10:13AM
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండో రోజూ తీవ్ర గందరగోళం మధ్యే ప్రారంభమయ్యాయి. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకుపోయి ఆందోళన చేపట్టారు.
ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు యధాప్రకారం తెలుగుదేశం సభ్యులను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఈ ప్లకార్డులను కోర్టుల వద్ద ప్రదర్శించాలన్నారు. అసెంబ్లీ ఏమీ తెలుగుదేశం కార్యాలయం కాదనీ ఇష్టారీతిగా వ్యవహరిస్తే సహించేది లేదనీ హెచ్చరించారు. సభలో అన్ని విషయాలూ చర్చిస్తామని చెబుతున్నా తెలుగుదేశం రచ్చ చేస్తున్నదని విమర్శించారు. సీఎంను ఉద్దేశించి ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమనీ, నోరు అదుపులో పెట్టుకోవాలని మాట్లాడారు. ఈ దశలో తెలుగుదేశం సభ్యులు కూడా అంబటికి దీటుగా సమాధానం ఇచ్చారు.
సభలో పరిస్థితి గందరగోళంగా మారడంతో ప్రభుత్వ విఫ్ ప్రసాదరాజు.. జోక్యం చేసుకుని సభలో సెల్ ఫోన్ తో వీడియోలు తీస్తున్న తెలుగుదేశం సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. కాగా అందుకు తెలుగుదేశం సభ్యులు సైకో పాలన పోవాలంటూ నినాదాలు చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే స్పీకర్ తెలుగుదేశం సభ్యులు అచ్చెన్నాయుడు, అశోక్ లను ఈ సమావేశాలు పూర్తయ్యే వరకూ సస్పెండ్ చేశారు. అనంతరం స్పీకర్ సభను వాయిదా వేశారు.