తమ్మినేనీ.. స్పీకరేనా మీరు?

 స్పీకర్ స్థానంలో  కూర్చున్నది ఎవరైనా, ఆ స్థానానికి ఒక విలువ ఉంది. అందుకే, చట్ట సభల్లో స్పీకర్ స్థానాన్ని, గౌరవంగా సంబోధించాలి, సంబోధిస్తారు. అలాగే, స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి  తాను స్వతహాగా,ఎలాంటి వారైనా, ఎలాంటి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినా తాను కూర్చున్న  స్థానం గౌరవాన్ని నిలబెట్టవలసి ఉంటుంది. అదే స్పీకర్ ప్రథమ కర్తవ్యం. స్పీకర్ రాజకీయ పదివి కాదు, రాజ్యాంగ పదవి, అందుకే, స్పీకర్ గా ఎన్నికైన వ్యక్తి  ప్రమాణ స్వీకారానికి ముందే, రాజకీయ సభ్యత్వానికి రాజీనామా చేసి, బాధ్యతలు స్వీకరించడం ఒకప్పుడు ఆనవాయితీగా ఉండేది.. స్వతంత్ర భారత లోకసభ మొదటి స్పీకర్ గణేశ్ వాసుదేవ్ మావలాంకర్  ఆ ఒరవడికి శ్రీకారం చుట్టారు. అయితే అనంతర కాలంలో  వచ్చిన స్పీకర్లు చాలా వరకు  రాజకీయ సభ్యత్వానికి రాజీనామా చేసినా చేయక పోయినా, ‘చైర్’ గా సంభోదించే స్పీకర్ స్థానం గౌరవాన్ని దిగజార్చే స్థాయికి దిగజారలేదు. 

అయితే  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలతో పాటు రాజ్యంగ వ్యవస్థలు రాజకీయం రంగు పులుముకున్నాయి. స్పీకర్ వ్యవస్థ అందుకు మినహాయింపు కాదని ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం పదే పదే రుజువు చేస్తున్నారు. తాజాగా గురువారం (సెప్టెంబర్ 21)న అసెంబ్లీలో తన తీరుతో మరోమారు ఆ విషయాన్ని తమ్మినేని సందేహాలకు అతీతంగా రుజువు చేశారు. స్పీకర్ స్థానలో ఉన్న వ్యక్తిని రాజకీయ పదవుల ఆకాంక్షలు, రాజకీయ వాసనలు వదలకపోతే ఆ  స్థానం విలువ దిగజారుతుంది.  గురువారం(సెప్టెంబర్ 21) ఆంధ్ర ప్రదేశ్  అసెంబ్లీలో అదే జరిగింది. అవును. ఏపీ అసెంబ్లీ స్పీకర్  తమ్మినేని సీతారాం ప్రతిపక్ష సభ్యుని ఉద్దేశించి, ‘వాట్ ఈజ్ దిస్... యూజ్‌లెస్ ఫెలో.. ఎవడ్రా చెప్పాడు నీకు’అంటూ చేసిన వ్యాఖ్యలు విస్మయం కలిగిస్తున్నాయి.

నిజానికి సభ్యులు అదుపు తప్పి  నోరు జారితే మందలించో మరో మార్గంలోనూ సభ్యులను దారికి తెచ్చి,సభను సజావుగా నడిపించాల్సిన పవిత్ర బాధ్యతలో ఉన్న స్పీకరే, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే..? స్పీకర్ గౌరవమే కాదు. సభ గౌరవం కూడా పలచనవుతుంది. ఇప్పటికే దిగజారిన చట్ట సభల ప్రతిష్ట మరింత దిగజారి, పరిహాసం పాలవుతుంది. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో జరిగింది సరిగ్గా అదే.   

అందుకే తెలుగు దేశం  అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ గురించి సభలో ఎక్కడా వినిపించకూడదని వైసీపీ తీసుకున్న రాజాకీయ నిర్ణయాన్నే, స్పీకర్  ఫాలో అయ్యారా  అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పీకర్ స్థానాన్ని గౌరవించలేదనే కారణాన్ని చూపుతూ మొదటి రోజు సమావేశాల నుంచి ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపైనైతే ఏకంగా ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకూ సస్పెన్షన్ వేటు వేశారు.  

ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడం ఒక ఎత్తైతే.. అంతకుమించి స్పీకర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసినట్లు చెపుతున్న వ్యాఖ్యలు, స్పీకర్ స్థానం విలువలను పలుచన  చేశాయన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలైన తొలి రోజే స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసించిన టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలకు పూనుకున్నారు. నిజమే తమ నాయకుడి అక్రమ అరెస్ట్ ను జీర్ణించుకోలేని టీడీపీ సభ్యులు ఆవేదనలో ఆగ్రహాన్ని ప్రదర్శించి ఉంటే ఉండవచ్చును. కానీ అలాంటి సమయంలోనే కదా స్పీకర్ విజ్ఞత, వివేచనతో వ్యవహరించ వలసినది. కానీ, స్పీకర్ తమ్మినేసి ఆవేదనతో  ఆగ్రహించిన  సభ్యులను సమాధాన పరిచే ప్రయత్నం   చేయకుండానే  వారిపై  సస్పెన్షన్ వేటు వేశారు.

 స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచేలా కాగితాలు చించివేశారని, మీసాలు మెలివేయడం, తొడలు చరచడం లాంటి వికృత చేష్టలకు పాల్పడ్డారని కారణాలుగా చెప్పారు. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేశారు.  ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి ‘యూజ్‌లెస్ ఫెలోస్’, ‘ఎవడ్రా చెప్పాడు నీకు’ వంటి భాషను వాడడంతో  వేళ్లన్ని ఆయనవైపే చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్పీకర్ ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? స్పీకర్ స్థాయి వ్యక్తికి ఇది తగునా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

అనుచితంగా వ్యవహరించిన స్పీకర్‌పై ప్రతిపక్ష తెలుగుదేశం మండిపడింది. ఆయన తీరును ఎక్స్‌ (గతంలో ట్విటర్) వేదికగా ఖండించింది. ఈయన అసలు స్పీకర్ పదవికి అర్హుడేనా? అని నిలదీసింది.  టీడీపీ వాళ్ళని యూజ్ లెస్ ఫెలో అంటారు.. వైసీపీ వాళ్ళని ‘మన వాళ్ళు’ అంటారు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీలో మాట్లాడిన వీడియో క్లిప్‌ను కూడా టీడీపీ షేర్ చేసింది. దీంతో స్పీకర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఈ విధంగా వ్యవహరించడం కొత్తేమీ కాదని, తన తీరులో మార్పురాదని మరోసారి ఆయనే స్వయంగా చాటి చెప్పారని.. అసెంబ్లీలో జరిగిన సంఘటనలను ఉటంకిస్తూ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక అనుచితంగా ప్రవర్తించారని ఎమ్మెల్యేలపై వేటు వేసిన స్పీకర్ ఇలా మాట్లాడొచ్చా అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు. వీటిపై స్పీకర్ స్పందిస్తారో లేదో వేచిచూడాలి మరి.