భారత్‌కు ట్రంప్ యాపిల్ స్ట్రోక్

 

భారత్‌కు ట్రంప్ యాపిల్‌తో స్ట్రోక్‌లు ఇచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. యాపిల్‌ తయారీ ప్లాంట్లు తరలివస్తాయని ఆశలు పెట్టుకొన్న భారత్‌కు నిరాశే మిగిలేట్లు ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా టిమ్‌కుక్‌తో మాట్లాడి.. భారత్‌కు ప్లాంట్లను తరలించొద్దని కోరారట. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడే స్వయంగా వెల్లడించారు. టిమ్‌ కుక్‌ భారత్‌లో తయారీ కర్మాగారాల నిర్మాణాలు చేపట్టారని,  అలా చేయడం నాకు ఇష్టం లేదని చెప్పానని,  ఫలితంగా అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు యాపిల్‌ అంగీకరించిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. 

ఖతార్‌లో జరిగిన ఓ సమావేశం సందర్భంగా యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌తో ట్రంప్‌ భేటీ అయ్యారు. అమెరికా ఉత్పత్తులపై అత్యధిక టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే చైనాపై భారీగా టారిఫ్‌లు విధించడం.. అమెరికాతో దానికి మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఉండటంతో యాపిల్‌ అప్రమత్తమైంది. అగ్రరాజ్యానికి అవసరమైన ఐఫోన్లు మొత్తాన్ని భారత్‌లో తయారు చేయించి ఎగుమతి చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. మన దేశంలో ఫాక్స్‌కాన్‌, టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థలు ఐఫోన్ అసెంబ్లింగ్‌ చేస్తున్నాయి. ఇటీవల కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. 

అమెరికా మార్కెట్లో జూన్‌ త్రైమాసికంలో విక్రయించే ఐఫోన్లలో అత్యధికంగా భారత్‌లో తయారైనవే ఉంటాయని.. అదే ఐపాడ్స్‌, మ్యాక్‌బుక్‌, యాపిల్‌ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్‌ వంటివి మాత్రం వియత్నాం నుంచి దిగుమతి చేసుకొంటామన్నారు. తమ దేశం నుంచి దిగుమతి చేసేకొనే చాలా రకాల వస్తువులపై భారత్‌ జీరో టారిఫ్‌లను ఆఫర్‌ చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు.  అమెరికాకు భారత్‌ ఓ డీల్‌ను ఆఫర్‌ చేసింది. ఇది ప్రాథమికంగా జీరో టారిఫ్‌లదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే భారత్‌-అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందంపై  జోరుగా చర్చలు జరుపుతున్నాయి. వీటి పురోగతి గొప్పగా ఉందని ఏప్రిల్‌ 30వ తేదీ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. త్వరలోనే ఒప్పందానికి వస్తామని నాడు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటిదిప్పుడు యాపిల్‌ మన దేశం నోటి దగ్గర నుంచి లాగేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu