బళ్ళారి ఉక్కు మహిళ మనసెలా కరిగిపోయిందో?

 

బళ్ళారి ఉక్కు మహిళగా పేరొందిన బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ తెలంగాణాకు బేషరతుగా మద్దతు ఇస్తామని మొదట ప్రకటించినప్పటికీ ఆ తరువాత మారిన పార్టీ వైఖరికి అనుగుణంగా తను కూడా మాట మార్చి సీమాంధ్రకు న్యాయం చేయనిదే బిల్లుకి మద్దతు ఈయలేమని చిలుక పలుకులు పలకడం మొదలుపెట్టారు. కానీ, అకస్మాత్తుగా ఆమెను ఎవరో హిప్నటయిజ్ చేసినట్లు లోక్ సభలో బిల్లుకి మద్దతు పలికి వచ్చారు. ఆ తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ “తాము ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చామని, అందువల్ల తెలంగాణా ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణా ప్రజలు తలుచుకొన్న ప్రతీసారి కూడా ఈ చిన్నమ్మను కూడా గుర్తుంచుకోవాలని” అని విజ్ఞప్తి చేసారు.

 

సభలో వెళ్ళేవరకు బిల్లుని అడ్డుకొని తీరుతామని ప్రగల్భాలు పలికిన బళ్ళారి ఉక్కు మహిళ సభలో అడుగుపెట్టగానే కాంగ్రెస్ ప్రతిపాదించిన బిల్లుని చూసి వెన్నలా కరిగిపోయి మద్దతు ఇవ్వడం అందరినీ చాలా ఆశ్చర్యపరిచింది. బళ్ళారి, ఓబులాపురం గనులను మేసిన గాలి సోదరులను ఆశీర్వదించిన పాపానికి, కాంగ్రెస్ పార్టీ తన అలావాటు ప్రకారం తన పెంపుడు చిలుకలను ఆ గనుల మీదకు వదులుతానని బెదిరించి ఆ ఉక్కుమహిళ మనసును కరిగించివేసిందా? అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, నిన్న లోక్ సభలో బిల్లుకి బేషరతు మద్దతు ఇచ్చిన బీజేపీ మళ్ళీ ఈరోజు అదే బిల్లు రాజ్యసభకు వచ్చినప్పుడు వ్యతిరేఖించడం కూడా అంతే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈసారి వ్యతిరేఖించడానికి కారణం ఏమిటని అందరూ ఆలోచనలో పడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu