ముఖ్యమంత్రి కుర్చీ కోసం డిల్లీలో పైరవీలు షురూ
posted on Feb 20, 2014 5:24AM
.jpg)
రాష్ట్ర విభజన ప్రక్రియ అంతిమ దశకు చేరుకోవడం, కిరణ్ కుమార్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో, ఇక అందరి దృష్టి ముఖ్యమంత్రి పీఠంపై పడింది. ఎన్నికలకు ఇంకా కేవలం రెండు నెలలు మాత్రమే మిగిలి ఉన్నఈ సమయంలో కూడా ముఖ్యమంత్రి పదవికి ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల నుండి అనేకమంది బారులు తీరి డిల్లీలో పైరవీలు చేయడం చూస్తుంటే, ప్రజాసేవ కోసమే పుట్టామని చెప్పుకొనే మన నేతలకి పదవీ లాలస ఎంతగా ఉందో అర్ధమవుతుంది. తెలంగాణా ఏర్పడుతున్న కారణంగా సంతోషంగా ఉన్న టీ-కాంగ్రెస్ నేతలు పదవుల కోసం ఆరటపడినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, రాష్ట్ర విభజన జరుగుతునందుకు సీమాంధ్రలో ప్రజలు బాధతో అక్రోశిస్తుంటే, కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు డిల్లీలో తిష్టవేసి ఏ కాంగ్రెస్ అధిష్టానం, సోనియమ్మ అందుకు కారకులయ్యారో వారి చుట్టూనే ఏ మాత్రం సిగ్గులేకుండా ప్రదక్షిణాలు చేస్తూ ముఖ్యమంత్రి పదవి పైరవీలు చేస్తుండటం సీమాంధ్ర ప్రజల దౌర్భాగ్యమే. రేపు రాష్ట్రం విడిపోయిన తరువాత, రెండు నెలలు ముఖ్యమంత్రి పదవి కోసం ఇంతగా దిగజారిన వీరి చేతికే అధికారం అప్పజెప్పితే రాష్ట్ర భవిష్యత్తు ఏవిధంగా ఉంటుందో చెప్పలేకపోయినా, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేంద్రం నుండి విడుదలయ్యే భారీ నిధులతో వీరందరి భవిష్యత్తు ఉజ్వలంగా మారిపోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చును.