చంద్రబాబుపై సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ కోరుతూ పిటిషన్.. కొట్టేసిన సుప్రీం

చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. ఈ సందర్భంగా ఇదొక పనికిమాలిన పిటిషన్ అని వ్యాఖ్యానిస్తూ పిటిషనర్ తరఫు న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ కు సంబంధించి మరొక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని, అసలీ పిటిషన్ పై వాదించడానికి ఎలా వచ్చారంటూ పిటిషన్ తరఫున్యాయవాదిని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.  

ఇంతకీ విషయమేంటంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఉన్న సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ   హైకోర్టు న్యాయవాది బాలయ్య సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ మంగళవారం సుప్రీం కోర్టులో  జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది   మణీందర్ సింగ్  అటెండ్ అయ్యారు. ఆయన తన వాదనలు ప్రారంభించకముందే సుప్రీం కోర్టు పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఇటువంటి పిటిషన్లను వాదించడానికి ఎలా వచ్చారు అంటూ జస్టిస్ బేలా త్రివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఇది పూర్తి స్థాయిలో తప్పుడు పిటిషన్ అని పేర్కొన్న జస్టిస్ ఈ పిటిషన్‌కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తాం అంటే హెచ్చరించారు.  

జగన్  హయాంలో చంద్రబాబుపై సీఐడీ వరుసగా కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్, అమరావతి ఇన్నర్‌ రింగు రోడ్డు, ఏపీ ఫైబర్‌నెట్‌, రాజధాని భూములు, అమరావతి అసైన్డ్‌ భూములు, ఉచిత ఇసుక విధానం, మద్యం విధానం వంటి అంశాలపై సీఐడీ   కేసులు నమోదు చేసిన సంగతి విదితమే. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 50 రోజులకు పైగా ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులపై విచారణ కొనసాగుతుండగానే ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. అయితే ఆ ఎన్నికల్లో.. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో సీఐడీ విచారణ నిష్పాక్షికంగా జరగదని అందుకే చంద్రబాబుపై సీఐడీ కేసులన్నిటినీ సీబీఐకి బదలీ చేయాలని కోరుతూ బాలయ్య సుప్రీం కోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు.  జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ ను కొట్టివేసింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu