కొమ్మినేనికి బెయిలు మంజూరు చేసిన సుప్రీం కోర్టు
posted on Jun 13, 2025 1:07PM

సుప్రీంకోర్టులో కొమ్మినేని శ్రీనివాసరావుకి ఊరట లభించింది. రాజధాని మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిలు కోరుతూ కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంను ఆశ్రయించారు. ఆయన బెయిలు పిటిషన్ పై సుప్రీం కోర్టు శుక్రవారం (జూన్ 13) విచారణ జరిపి బెయిలు మంజూరు చేసింది. దీంతో సుప్రీంలో కొమ్మినేనికి భారీ ఊరట లభించినట్లైంది. అయితే బెయిలు మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు కొమ్మినేనికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. అమరావతిపై మరోసారి అసభ్య, అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టంగా పేర్కొంది. భవిష్యత్ లో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలని సూచించింది. అదే సమయంలో ప్రభుత్వంపైనే కొన్ని వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్య్రాన్ని పరిరక్షించాలని పేర్కొంటూ నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా అని సుప్రీం ప్రశ్నించింది.
ఒక చానెల్ లో కొమ్మినేని నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న మరో జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతిపైనా, అమరావతి మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటని ఖండిచకుండా కొమ్మినేని చర్చను కొనసాగించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. అమరావతి మహిళలు కొమ్మినేని, కృష్ణంరాజులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కొమ్మినేనిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే.