జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయిన పనులేంటో తెలుసా?
posted on Dec 29, 2025 2:10PM
.webp)
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ పరాజయానికి ప్రధాన కారణం తన హయాంలో జరిగిన మేలు ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం కావడమేనని తరచూ చెబుతుంటారు. తన ఓటమికి కారణం ఆ చెప్పుకోలేకపోవడమేనని నమ్ముతుంటారు.
ఇంతకీ ఆయన హయాంలో చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటి? అంత చేసీ ఎందుకు చెప్పుకోలేకపోయారు అన్న విషయంపై సామాజిక మాధ్యమంలో ఓ స్థాయిలో డిబేట్ జరుగుతోంది. వాస్తవానికి ఆయన అరకొరగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు అంతకు వందింతల ప్రచారం చేసుకున్నారు. జగన్ చేసిన సంక్షేమ పథకాల ప్రచారానికి ప్రత్యేకంగా ఒక నెట్ వర్కే ఉండేది. ఏపీడీసీ వంటి సంస్థలు కూడా ఆ నెట్ వర్కక లో ఉండేది. ఏపీసీసీని జగన్ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ (ఏపీడీసీ)గా పేరు మార్చి దానికి భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించారు.
ఒక నిమిషానికి రెండున్నర వేలు ఇవ్వాల్సింది కాస్తా పది పన్నెండు వేలుగా ఇచ్చి.. మరీ వీడియోల రూపకల్పన చేశారు. ఇదిలా ఉంటే సంక్షేమ పథకాల బటన్ నొక్కుడు కార్యక్రమాలకు సిద్దం సభలకన్నా మించిన సభలు ఏర్పాటు చేసి... వాటి ద్వారా జనాన్ని పోగేసి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కూడా జగన్ హయాంలో ప్రభుత్వ సంక్షేమాన్ని గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ప్రచారం నిర్వహించారు.
ఇందుకు ఒక ఎమ్మెల్సీ తన సిబ్బందితో ఈ కార్యక్రమాలను పర్యవేక్షించగా.. వాటిని నాటి మంత్రి పెద్ది రెడ్డి సూపర్వైజ్ చేసేవారు. ఇందుకు రూ.కోట్లు ఖర్చు చేసేవారు. ఇక్కడ చెప్పుకోవల సిందేమిటంటే.. ఓట్ల కోసం చేసిన ప్రజాధనం ఖర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అదనపు ఖర్చు కూడా భారీ ఎత్తున జరిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు. వారి శోధనలో జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటంటే..
ఎలుకలు పట్టడానికి కేటాయించిన రూ. 1. 6 కోట్లు, తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కంచె కోసం ఖర్చు చేసిన రూ. 12. 5 కోట్లు, ఎగ్ పఫ్ ల కోసం రూ. 3. 6 కోట్లు, పాస్ పుస్తకాలపై తన ఫోటోల కోసం రూ. 13 కోట్లు, వైయస్ విగ్రహాల ఖర్చు రూ. 18 కోట్లు, స్కూళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడానికి ఖర్చు చేసిన రూ.150 కోట్లు. తన పర్యటనల కోసం విమానాలు, హెలికాప్టర్ల కోసం ఖర్చు చేసిన రూ. 222 కోట్లు. వీటి గురించే జగన్ చెప్పుకోలేకపోయారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
అంతేనా రుషికొండ ప్యాలెస్ కి రూ. 600 కోట్లు, బియ్యం సంచులు మోయడానికి రూ. 700 కోట్లు, సరిహద్దు రాళ్లపై ఫోటోలకు ఇంకో రూ. 700 కోట్లు కూడా జగన్ ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారు. ఆ ఖర్చుల గురించి కూడా జగన్ జనాలకు చెప్పుకోలేకపోయారట. ఆ కారణంగానే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందన్నది జగన్ భావన అని నెటిజనులు తేల్చారు. అవి చెప్పుకోలేకపోవడం వల్లనే కనీసం 11 స్థానాలైనా వచ్చాయనీ, వాటి గురించి కూడా ఘనంగా చెప్పుకుని ఉంటే, అవి కూడా వచ్చేవి కావని సామాజిక మాధ్యమంలో జగన్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది.