మంత్రి రజనీకి సమస్యల సెగ.. సమాధానం చెప్పలేక సతమతం!
posted on Apr 21, 2022 1:15PM
మేడమ్.. మందుల్లేవ్...
మేడమ్.. కుర్చీలు లేవ్...
మేడమ్.. డాక్టర్లు లేరు...
మేడమ్.. రోగులు తిడుతున్నారు మేడమ్.
ఇలా మేడమ్ మేడమ్ అంటూనే.. మంత్రి విడదల రజనీకి సమస్యల సెగ తగిలించారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు. దొరికిందే ఛాన్స్ అంటూ.. జీజీహెచ్ ప్రాబ్లమ్స్ అన్నీ మంత్రి ముందు ఏకరువు పెట్టారు. అవన్నీ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే కావడంతో.. మంత్రి రజనీ బిక్కముఖం వేసుకోక తప్పలేదు. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తానంటూ రొటీన్ డైలాగ్ చెప్పి.. ఇక్కడికి ఎందుకొచ్చానా అనుకుంటూ.. వెళ్లిపోయారు. మినిస్టర్ అయ్యాక.. తొలిసారి మంత్రి హోదాలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులపై సమీక్ష నిర్వహించిన విడదల రజనీ.. అక్కడి సమస్యలు చూసి.. వామ్మో జగనన్న పాలన ఇంత అధ్వాన్నంగా ఉందా అని మనసులో అనుకుని ఉండే ఉంటారు. మరోసారి, ఇంకో ఆసుపత్రికి వెళ్లకుండా జీజీహెచ్ సిబ్బంది మంత్రికి గట్టి ఝలకే ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే...
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజనీ జీజీహెచ్‌లో సమీక్ష నిర్వహించారు. ఆమె వెంట ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు తమ విభాగాల్లోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
"గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఉన్న 32 విభాగాల్లో ఒక్క విభాగంలోనూ అవసరమైన మందులు లేవు. అత్యవసర విభాగంలో కూడా మందులు లేవు. కనీసం ఆపరేషన్ థియేటర్‌లో వినియోగించే మందులు కూడా సరఫరా చేయట్లేదు. బయటి నుంచి కొనుగోలు చేద్దామంటే ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం లేదు. పాత బకాయిలు ఇస్తేనే మందులు సరఫరా చేస్తామంటున్నారు".. ఇదీ మంత్రి రజనీకి జీజీహెచ్ మెడకల్ స్టోర్ ఇన్‌చార్జ్ సుధీర్ వివరించిన వాస్తవ పరిస్థితి.
మెడికల్ స్టోర్ ఇన్‌చార్జి మాటలతో ఒక్కసారిగా షాక్ తిన్నారంతా. వెంటనే మైకులు ఆపేసి, ఆయనను కూల్ చేశారు. ఇటువంటి సమస్యలను మీరే పరిష్కరించుకోవాలంటూ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఉద్దేశించి కృష్ణబాబు వ్యాఖ్యానించారు.
అక్కడే ఉన్న ఎమ్మెల్యే ముస్తఫా సైతం ఆసుపత్రి నిర్వహణపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎవరి గురించో ఎందుకు.. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని జీజీహెచ్‌లో చేర్పిస్తే సరైన చికిత్స అందించలేదంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వెళ్లగక్కారు. తన తల్లికే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక సామాన్య రోగుల వైద్యం గురించి చెప్పేదేముందని మండిపడ్డారు. మందులు లేక రోగులు తిట్టుకుంటున్నారని.. కనీసం డాక్టర్లు కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవంటూ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
ఇక, యూరాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ ప్రకాశరావు సైతం తన ప్రాబ్లమ్స్ చెప్పుకొచ్చారు. యూరాలజీ విభాగంలో ఉన్న ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇటీవల విశాఖపట్నం బదిలీ అయ్యారని.. అక్కడి నుంచి వచ్చిన ఇద్దరు వైద్యులు విధుల్లో చేరి.. ఆ వెంటనే సెలవుపై వెళ్లిపోయారని చెప్పారు. సరిపడా డాక్టర్లు లేక.. తాను ఒక్కడినే రోగులకు చికిత్స చేయడం కష్టంగా ఉందన్నారు ఆ విభాగం హెడ్ ప్రకాశరావు. వెంటనే స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు.. ఇకపై బోధనాసుపత్రుల్లో వైద్యులు లాంగ్ లీవ్ పెడితే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.
ఇలాంటి సమీక్షలు విడదల రజనీకి కొత్త కావడంతో.. ఆమె పెద్దగా ఏమీ మాట్లాడలేకపోయారు. మందులు లేవంటే, డబ్బులు ఇవ్వడం లేదని మెడిసిన్ సప్లై చేయడం లేదంటే.. అదంత ప్రభుత్వ వైఫల్యమే కదా? ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేకుండా చేస్తున్న జగనన్న.. అప్పులు చేసి మరీ పప్పుబెల్లాలు పెంచుతున్నారుగా. ఇప్పుడు ఆ అప్పులు కూడా దొరక్క.. ఆగమాగం అవుతున్నారని తెలిసిందే. మరి, ఆసుపత్రులో మందులు కొనేందుకు, కుర్చీలు కొనేందుకు నిధులు ఎలా వస్తాయి? ఇదేదో తేడాగా ఉందని భావించిన మంత్రి రజనీ.. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొత్త మంత్రికి జీజీహెచ్‌లో గట్టిగానే షాక్ తగిలినట్టుంది..అంటున్నారు.