జయలలిత ఫొటో ఎందుకు- సుప్రీంకోర్టు ఆక్షేపణ

 

రాష్ట్ర ప్రభుత్వ పథకాలకి సంబంధించిన ప్రకటనల మీద, ముఖ్యమంత్రుల ఫొటోలు ఉండరాదంటూ సుప్రీం కోర్టు గత ఏడాది ఓ తీర్పునిచ్చింది. మరీ అంతగా అవసరం అయితే దేశ ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్య న్యాయమూర్తి ఫొటోలు మాత్రమే ముద్రించాలని సదరు తీర్పులో పేర్కొంది. మరి అమ్మ బొమ్మ లేకుండా తమిళనాడులో ఏ ప్రకటనా ఉండదు కదా! అందుకని సాక్షాత్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా కూడా అక్కడి పౌరసంబంధాల శాఖ, జయలలిత బొమ్మలతోనే ప్రభుత్వ ప్రకటనలను రూపొందిస్తోంది. దిల్లీలోని కేజ్రీవాల్‌ ప్రభుత్వం కూడా ‘కేజ్రీవాల్ మీకోసం ఏమేం చేశారంటే’ అంటూ ఆయన చిత్రాలతో కూడిన ప్రకటనలను రూపొందిస్తోంది.

ఈ విషయమై సుప్రీంకోర్టులో ఓ కేసు దాఖలు కావడంతో, న్యాయస్థానం ఆయా రాష్ట్రాలకు తాఖీదులను పంపింది. కానీ సదరు రాష్ట్రాల తరఫున వాదిస్తున్న న్యాయవాది మాత్రం ఇందులో తప్పేముంది అంటూ సుప్రీం కోర్టునే తిరిగి ప్రశ్నించారు. దేశానికి ప్రధానమంత్రి ఎంత ముఖ్యుడో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అంతే అవసరమనీ... రాష్ట్రానికి సంబంధించిన పథకాలలో వారి ముఖచిత్రం ఉండటమే సబబనీ సదరు న్యాయవాది పేర్కొన్నారు. మరి సుప్రీంకోర్టు ఈ వాదనతో ఏకీభవించి తన మాటని వెనక్కి తీసుకుంటుందో లేకపోతే తీర్పుని గౌరవించనందుకు జయలలిత ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తుందో చూడాలి!