అదేపనిగా చూస్తున్నారని... విమానంలోంచి దించేశారు

 

తీవ్రవాదుల మీద అమెరికా పైచేయి సాధించి ఉండవచ్చుగాక. కానీ ఇంకా ఏమూల నుంచి ఎవరు దాడి చేస్తారో అన్న భయంతోనే బతుకుతున్నట్లున్నారు. అందులోనూ 2001 సెప్టెంబరు 11న విమానాలతో అమెరికా మీద దాడి చేసిన దగ్గర్నుంచీ అక్కడి విమానయాన సంస్థలు అతిజాగ్రత్తగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. అమెరికాలోని బోస్టన్‌ నగరం నుంచి లాస్‌ఏంజిల్స్ నగరానికి వెళ్తున్న ఓ విమానంలో ఇద్దరు ముస్లిం వనితలు ఎక్కారు. అయితే వారి చూపులు తనకి ఇబ్బందిగా ఉన్నాయంటూ విమానంలోని ఓ ఉద్యోగి చెప్పడంతో, మిగతా ప్రయాణికులకంటే ముందే వారిద్దరినీ దింపేశారు.

ఈ తతంగాన్నంతా రహస్యంగా చిత్రీకరించి యూట్యూబ్‌లో పెట్టడంతో జరిగిన విషయం ప్రపంచానికి తెలిసింది. నిజానికి ఆ ముస్లిం మహిళలు చాలా అమాయకంగా ఉన్నారనీ, తమ ప్రయాణాన్నంతా సినిమాలు చూస్తూ గడిపారని సాటి ప్రయాణికుల పేర్కొన్నారు. అయినా ఈ విమానాన్ని నడుపుతున్న జెట్‌బ్లూ సంస్థ మాత్రం తన తప్పును ఒప్పుకోలేదు సరికదా.... ‘వాళ్లు మా గురించి సమాచారాన్ని సేకరిస్తున్నారన్న అనుమానంతో దింపేశాం. అసౌకర్యానికి చింతిస్తున్నాం!’ అని చేతులు దులిపేసుకుంది.