మళ్ళీ అర్ధరాత్రి తెరుచుకొన్న సుప్రీం కోర్టు తలుపులు

 

సుమారు ఐదు నెలల క్రితం, ముంబై వరుస బాంబు ప్రేలుళ్ళ కేసులో నిందితుడు యాకూబ్ మీమన్ ఉరి శిక్షని నిలిపివేయాలని కోరుతూ దాఖలయిన పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు జూలై 30వ తేదీన అర్ధరాత్రి సమావేశమయింది. నిర్భయ కేసులో బాల నేరస్థుడి విడుదలపై స్టే కోరుతూ డిల్లీ మహిళా కమీషన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకుర్‌ నేతృత్వంలో జస్టిస్‌ ఏకే గోయెల్‌, జస్టిస్‌ యు.యు.లలిత్‌ల సుప్రీం ధర్మాసనం మళ్ళీ నిన్న అర్ధరాత్రి 1.30 గంటలకు జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకుర్‌ నివాసంలో సమావేశమయింది.

 

న్యాయవాదులు గురు కృష్ణ కుమార్‌, దేవ్‌దత్‌ కామత్‌ తదితరులు ఈ విచారణలో వాదించారు. వారి వాదోపవాదాలు విన్న తరువాత సుప్రీం త్రిసభ్య ధర్మాసనం బాలనేరస్తుడి విడుదలపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కానీ ఇదే కేసుపై దాఖలయిన మరొక పిటిషన్ పై సోమవారం విచారణ చేపడుతున్నందున అప్పుడు తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.

 

బాల నేరస్థుడిని విడుదల చేసిన తరువాత పోలీసులు అతనిని డిల్లీలోనే ఒక స్వచ్చంద సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ అతని భద్రత ద్రష్ట్యా అతని పేరుతో సహా పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని మార్చివేయబోతున్నట్లు సమాచారం. కొన్ని రోజులపాటు అతని చేత సమాజసేవ కార్యక్రమాలలో చేయించిన తరువాత అతనిని విడిచిపెడతారని సమాచారం. కానీ ఒకవేళ సుప్రీం కోర్టు అతని నిర్బంధం పొడిగించాలని నిర్ణయించినట్లయితే, అతను మళ్ళీ జైలుకి వెళ్ళక తప్పదు. కానీ ఈరోజు తెల్లవారు జామున సుప్రీం ధర్మాసనం అభిప్రాయాన్ని బట్టి చూసినట్లయితే అతని విడుదలపై స్టే మంజూరు చేయకపోవచ్చునని భావించవచ్చును.