సుజనా ఇది సరైన పద్ధతి కాదు.. చంద్రబాబు
posted on Aug 6, 2016 3:59PM

ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో ఒకపక్క ఏపీ ఎంపీలందరూ కలిసి ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈవిషయంలో టీడీపీ నేత సుజనా చౌదరి రాజ్యసభలో వ్యవహరించిన తీరుకు విమర్శలు తలెత్తుతున్నాయి. పార్లమెంట్లో నిన్న కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ జరుగిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు చర్చ సందర్భంగా సభలో పెద్ద గందరగోళం నెలకొంది. ఇక కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ బిల్లు పై మాట్లాడుతూ.. ఇది ద్రవ్య బిల్లు అని చెప్పారు. అయితే దీనికి మిత్రపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆఖరికి ఈ విషయంలో స్పీకర్ కురియన్ స్పందించి.. ప్రైవేటు బిల్లును ఆర్థిక బిల్లా కాదా అన్న అంశం లోక్ సభ స్పీకర్ తేలుస్తారని.. రాజ్యసభ స్పీకర్ కు ఆ అవకాశం లేదని చెప్పారు. కురియన్ అలా ప్రకటించగానే బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడే సుజనా చౌదరి పప్పులో కాలేశారు. బీజేపీ నేతలతో కలిసి ఆయన కూడా చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. అంతే దీంతో ఇప్పుడు ఇది పెద్ద దుమారమైంది.
ఇక దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు బిల్లు గురించి ప్రస్తావిస్తూ.. రాజ్యసభలో సుజనాచౌదరి చప్పట్లు కొట్టడం సరైన చర్య కాదని అన్నారు.