సుజనా చౌదరికి కేంద్రమంత్రి పదవి?
posted on Nov 7, 2014 7:13AM
(4).jpg)
ఈ ఆదివారం జరగనున్న కేంద్రమంత్రి వర్గ విస్తరణలో తెదేపా సీనియర్ నేత మరియు యాపీ సుజన చౌదరికి కేంద్రమంత్రి పదవి దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి తెదేపా తరపున ఒకరిని కేంద్రమంత్రి పదవికి సిఫార్సు చేయవలసిందిగా కోరడం ఆయన సుజనా చౌదరి పేరు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ కి పదోన్నతి కల్పించి, ఆమె స్థానంలో సుజనా చౌదరిని తీసుకోవచ్చని సమాచారం. సుజనా చౌదరి చేరికతో ఆంద్రప్రదేశ్ తరపున చూసుకొన్నట్లయితే నలుగురు మంత్రులు (వెంకయ్య నాయుడు, అశోక్ గజపతి రాజు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి) కేంద్రంలో ప్రతినిధులుగా ఉన్నట్లవుతుంది. తెలంగాణా నుండి బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు కేంద్రమంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న యం.వెంకయ్య నాయుడిని, మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న స్మృతీ ఇరానీలను వేరే శాఖకు మార్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.