విశాఖలో డిస్నీఐలాండ్ ఏర్పాటు?
posted on Nov 6, 2014 7:02PM
.jpg)
ప్రపంచంలో గల ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రాలలో డిస్నీ ల్యాండ్ కూడా ఒకటని అందరికీ తెలిసిన విషయమే. తాజా సమాచారం ప్రకారం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన డిస్నీల్యాండ్ త్వరలో వైజాగ్ లో కూడా ఏర్పాటయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో మొట్టమొదటి డిస్నీల్యాండ్ ను వైజాగ్ నగరంలో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ యాజమాన్యం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు దాదాపు 2000 ఎకరాల స్థలం, వేల కోట్లు పెట్టుబడి అవసరం ఉంటుంది.
ఈ ప్రాజెక్టు వైజాగ్ లో ఏర్పాటయినట్లయితే రాష్ట్రానికి భారీ పెట్టుబడి, రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి, దాని వలన రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాక వేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించడమే కాక రవాణా, హోటల్, రియల్ ఎస్టేట్ తదితర అనేక రంగాలకి ఊహించనంత మేలు జరుగుతుంది. ఇప్పటికే మెల్లగా మెట్రో హంగులన్నీ సంతరించుకొంటున్న వైజాగ్ నగరం, ఈ ప్రాజెక్టు వచ్చినట్లయితే అంతర్జాతీయ స్థాయికి తీసిపోని విధంగా మారిపోవచ్చును.