ప్రత్యేక హోదాపై సుజనా ట్విస్ట్.. పవన్ కళ్యాణ్ నోరు మూయించేందుకే
posted on Jul 23, 2015 5:40PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదాపై చర్చలు జరుగుతున్నాయని.. ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాడతామని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సుజనా చౌదరి మరో ట్విస్ట్ ఇచ్చారు. లోకసభ జరిగితేనే కదా, మనం ప్రత్యేక హోదా, నిధుల గురించి కేంద్రాన్ని అడగడానికి వీలుంటుందని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కానీ ప్రారంభమైన రోజునుండే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలు చేపట్టడం మొదలుపెట్టారు. సభను సక్రమంగా జరగకుండా పదేపదే అడ్డుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఏపీ ప్రత్యేక హోదా గురించి చర్చించడం కష్టమైన పనే కాని కేంద్రంతో పోరాడైనా సరే ప్రత్యేక హోదాకి నిధులు తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి ఏపీకి నష్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కూడా పార్లమెంట్లో తన వైఖరి వల్ల ఏపీకి నష్టం చేకూరుతుందని అన్నారు.
మరోవైపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని టిడిపి ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్ముడి విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు చేసే ధర్నాలన్నీ కంటితుడుపు చర్యలు అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ల నోర్లు మూయించేందుకే ప్రత్యేక హోదా కోసం ధర్నా అని వ్యాఖ్యానించారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయనుకోవడం లేదన్నారు. మొత్తానికి ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ మాటలు మన ఎంపీల మీద పనిచేసినట్టున్నాయ్.