జగన్ జన్మదినం సందర్భంగా పశుబలి
posted on Dec 22, 2025 9:55AM

అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా వైసీపీయులు చేసేది అరాచకమే అన్నది మరో సారి రుజువైంది. రప్పా.. రప్పా.. గంగమ్మ జాతర అంటూ రచ్చ చేస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ అధినేత జగన్ జన్మదినం సందర్భంగానూ హంగామా చేశారు. మూగజీవాలను బలి ఇచ్చి వాటి రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేసి తమ అరాచకానికి హద్దులు అంటూ లేవని మరోసారి నిరూపించుకున్నారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో ఆదివారం (డిసెంబర్ 21) వీరంగం సృష్టించారు. సర్పంచ్ ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఐదు గొర్రెలను నరికి, వాటి రక్తంతో జగన్ ఫ్లెక్సీకి అభిషేకం చేశారు. మండల కేంద్రమైన విడపనకల్లు లోనూ అదే తంతు కొనసాగింది.
అలాగే శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలో వైసీపీ మద్దతు సర్పంచ్ బాలరాజు, నాయకులు కలసి మూగజీవాల తలలు నరికి, ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీకి అభిషేకం చేశారు. మరోవైపు జగన్ పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా పందువ నాగులారం పంచాయతీ పరిధిలోని గుమ్మలకర్ర జంక్షన్‌లో వైసీపీ అభిమాని ఒకరు 2029లో రప్పరప్ప.. 88 మ్యాజిక్ ఫిగర్ దాటినప్పటి నుంచి గంగమ్మ జాతరే అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గుమ్మలకర్ర గ్రామానికి చెందిన మన్నెపల్లి దినేష్ ఈ వివాదాస్పద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారంటూ తెలుగుదేశం శ్రేణులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ఫ్లెక్సీని తొలగించి దినేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.