రాయిదాడి జగన్నాటకమే.. బోండా ఉమాను ఇరికించేయత్నం?!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై రాయి దాడి ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. రాయిదాడి కేసులో నిందితుల‌ను గుర్తించేందుకు పోలీసులు ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురు మైన‌ర్ల‌ను, యువ‌కుల‌ను అదుపులోకి తీసుకొని ర‌హ‌స్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అయితే, జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న‌ను వైసీపీ రాజ‌కీయం చేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది. అయితే జగన్ పై గులకరాయి దాడిని హత్యాయత్నంగా చిత్రీకరించడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలు నవ్వుల పాలయ్యాయి.  చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోనే జ‌గ‌న్ పై రాయిదాడి ఘ‌ట‌న జ‌రిగింద‌ని, జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న‌ను చూసి తెలుగుదేశం ఓర్వ‌లేక పోతుంద‌ని వైసీపీ నేత‌లు విస్తృత ప్ర‌చారం చేశారు.  అంతేకాదు.. రాయిదాడి ఘ‌ట‌న జ‌రిగిన క్ష‌ణాల్లోనే వైసీపీ సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబు,  తెలుగుదేశం నేత‌ల‌పై విష‌ప్ర‌చారం జ‌రిగింది.  వైసీపీ నేత‌లు   మైకుల ముందుకొచ్చి చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు.

అయితే, పోలీసుల ద‌ర్యాప్తులో వెలుగులోకి వ‌స్తున్న విష‌యాల‌నుబ‌ట్టి  రాయిదాడి ఘ‌ట‌న‌కు తెలుగుదేశంకు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. జనం కూడా జగన్ పై రాయిదాడి సంఘటనలో తెలుగుదేశం ప్రమేయం ఉందని ఇసుమంతైనా నమ్మడం లేదు. సరే జనం నమ్మకపోతే పోనీ..  ఈ కేసును ఎలాగైనా టీడీపీ నేత‌ల‌పై నెట్టేసి వారిని అదుపులోనికి తీసుకుంటే తెలుగుదేశం ఎన్నికల ప్రచారంలో దూకుడునైనా ఆపవచ్చన్న తలంపుతో జ‌గ‌న్ మోహన్ రెడ్డి సూచ‌న‌ల‌తో పోలీసులు ఈ కేసులో తెలుగుదేశంను ఇరికించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తెలుగుదేశం విజ‌య‌వాడ‌ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థి బోండా ఉమాపై రాయిదాడి కేసును బలవంతంగా రుద్దే దిశగా పోలీసుల ద‌ర్యాప్తు కొన‌సాగుతున్నద‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. 

జ‌గ‌న్‌పై రాయిదాడి కేసులో మంగ‌ళ‌వారం (ఏప్రిల్ 16) తెల్ల‌వారు జామున వ‌డ్డెర కాల‌నీకి చెందిన ఎనిమిది మంది మైన‌ర్ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ర‌హ‌స్య ప్రాంతానికి త‌ర‌లించి విచారిస్తున్నారు. జ‌గ‌న్‌పై దాడి జ‌రిగిన ప్రాంతానికి వ‌డ్డెర ప్రాంతానికి కేవ‌లం 400 మీట‌ర్ల దూరమే ఉంటుంది. అయితే, త‌మ పిల్ల‌ల‌ను రెండు గంట‌ల్లో వ‌దిలిపెడ‌తామ‌ని తీసుకెళ్లార‌ని, పోలీస్ స్టేష‌న్ కు వెళ్లినా వారి స‌మాచారం ఇవ్వ‌డం లేద‌ని కాల‌నీ వాసులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ బ‌స్సుయాత్ర స‌మ‌యంలో రోడ్డుప‌క్క‌న నిల‌బ‌డితే రూ. 200 నుంచి 300 ఇస్తామ‌ని చెబితే వెళ్లామ‌ని, రూ. 200కు ఆశ‌ప‌డి వెళ్తే మా పిల్ల‌ల‌పై కేసులు పెట్టారంటూ వ‌డ్డెర కాల‌నీ వాసులు పోలీసుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కేసు ద‌ర్యాప్తులో 10మంది వ‌ర‌కూ న‌గ‌రంలోని వ‌డ్డెర కాల‌నీ యువ‌కుల్ని ప్ర‌శ్నించిన పోలీసులు అందులో స‌తీష్ అనే యువ‌కుడిని రాయి విసిరిన వ్య‌క్తిగా గుర్తించారు. ఆ త‌రువాత బుధ‌వారం బోండా ఉమ కార్యాల‌యంలో ప‌నిచేసే వేముల ద‌ర్గారావు అనే మ‌రో యువ‌కుడిని తీసుకెళ్లారు. అత‌ని నుంచి కీల‌క స‌మాచారం రాబ‌ట్టేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాయిదాడి కేసును ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై నెట్ట‌కుంటే ఎన్నిక‌ల్లో న‌ష్ట‌పోతామ‌ని భావిస్తున్న వైసీపీ పెద్ద‌లు  ఎలాగైనా తెలుగుదేశంకి ఈ కేసును అంట‌గ‌ట్టాల‌ని పోలీసుల‌కు ఆదేశాలు ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే  తెలుగుదేశం నేత బోండా ఉమ‌ను ఈ కేసులో ఇరికించి రాయిదాడి ఘ‌ట‌న‌ను తెలుగుదేశంపై నెట్ట‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొంద‌వ‌చ్చున‌న్నది జ‌గ‌న్ ప్లాన్‌గా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

వైసీపీ కుట్ర‌ల‌ను గుర్తించిన టీడీపీ నేత‌లు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ విష‌యంపై బోండా ఉమ స్పందిస్తూ..  సీఎం జ‌గ‌న్ పై రాయి దాడి ఘ‌ట‌న‌కు తనకు ఎలాంటి సంబంధం లేక‌పోయినా కొంద‌రు పోలీసు అధికారులు త‌న‌ను ఇరికించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. ఇందులో భాగంగానే త‌న ఆఫీసులో ప‌నిచేసే దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు  రాయిదాడి ఘ‌ట‌న‌లో తాజాగా ప‌రిణామాల‌పై తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు స్పందించారు. రాయిదాడి కేసులో నిందితులంటూ వ‌డ్డెర కాల‌నీ యువ‌కుల‌ను తీసుకుపోయారు. టీడీపీ నేత‌ల ప్రోద్భ‌లంతోనే దాడి జ‌రిగింద‌ని చెప్పించ‌డానికి య‌త్నిస్తున్నారంటూ  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలీసు శాఖ‌తో ప్ర‌భుత్వం త‌ప్పులు చేయిస్తోంది. బోడా ఉమా ఎన్నికల ప్ర‌చారాన్ని త‌ప్పుడు కేసుల‌తో అడ్డుకోవాల‌ని య‌త్నిస్తున్నారు. అలా జ‌రిగితే సంబంధిత అధికారుల‌ను కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక శిక్షిస్తామంటూ చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. సీఎంకు భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో విఫ‌ల‌మైన వారిని ఈ కేసు విచార‌ణ బాధ్య‌త‌ల‌నుంచి త‌ప్పించి,  ఈసీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో  వేరే అధికారుల‌తో స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు.

రాయి దాడి కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే  ఇదేమంత సంక్లిష్టమైన కేసు కాదు. కానీ, రాయి దాడి కేసులో తెలుగుదుశం నేతలను ఇరికించాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ పై రాయిదాడి జరగకుండా భద్రత కల్పించడంలో విఫలమైన పోలీసులపై చర్యలు తీసుకోకుండా.. వారితోనే కేసు దర్యాప్తు చేయిస్తుండటాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు అంతేకాదు. మైనర్లకు విచారణ పేరుతో తీసుకెళ్లి వారి ద్వారా తెలుగుదేశం నేతలే రాయిదాడి చేయాలని సూచించారని చెప్పించడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.  ఐదేళ్ల జగన్ ప్రభుత్వంపై  ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయం   ఇప్పటి వరకూ వెల్లడైన పలు సర్వేల   ఫలితాల్లో వెల్లడైంది. జగన్ ను  గద్దె దింపి సాగనంపడానికి ఏపీ ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చేశారని సర్వేలు తేల్చేశాయి.  జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి స్పందన కరవవ్వడం కూడా ఆయన పాలన పట్ల ప్రజలు విముఖంగా ఉన్నారని తెలియజేస్తున్నది.  దీంతో వైసీపీ నేతలు డబ్బులు ఇచ్చి ప్రజలను బలవంతంగా బస్సుయాత్రకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనాలంటే సానుభూతి పొందేలా ఏదో ఒక ఘటనను క్రియేట్ చేసి అయినా ప్రయోజనం పొందాలని జగన్ అండ్ కో రచించిన ప్రణాలికలో భాగమే  జగన్ రాయిదాడి ఘటన అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రమేయంతోనే జరిగినట్లుగా కోడికత్తి దాడి, బాబాయ్ గొడ్డలి పోటు ఘటనలను ప్రచారం చేసుకుని లబ్ధి పొందిన విధంగానే ఇప్పుడు రాయిదాడి కేసును ఉపయోగించుకుని గట్టెక్కాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు.   రాయిదాడి ఘటనను తెలుగుదేశం నేతలపై నెడితే ప్రజల్లో జగన్ పై సానుభూతి ఏర్పడుతుందన్నది వైసీపీ పెద్దల భావనగా పరిశీలకులు చెబుతున్నారు.  అందుకే  పక్కా ప్లాన్ ప్రకారం రాయిదాడి కేసును తెలుగుదేశం నేతలపైకి నెట్టేందుకు కసరత్తు జరుగుతోందని అంటున్నారు.