కరుణ వీర రస సమన్వయం శ్రీరామ తత్వం

శ్రీరామకథను మూడు దృక్కోణాలతో దర్శించి, ఆరాధించడం భారతీయ సంప్రదాయం. ఒకటి - ధార్మిక దృష్టి, రెండు- ఉపాసనాదృష్టి, మూడు తాత్త్విక దృష్టి.ఈ మూడింటి భావాలతో శ్రీరాముని అవతార కార్యం నడిచింది.  మానవ జీవన సరళిని మహోన్నతంగా మలచే 'ధార్మికత', మంత్రమయ భక్తి భావనతో పునీతులను చేసే 'ఉపాసనారీతి', పరమార్ధ తత్త్వాన్ని పట్టిచ్చే 'తాత్త్వికత'లు శ్రీరామునిలో మూర్తీభవించాయి.

రమణీయమైన ఒక దివ్యత్వం రాముడై, లోకాలకు "భద్రా"న్ని (క్షేమాన్ని) కలిగించడం చేత “రామభద్రు"డై, ప్రసన్న గుణాలతో ఆనందశాంతులను అందించడంచేత “రామ చంద్రు”డై పరిపూర్ణతత్త్వం “రామ, రామభద్ర, రామచంద్ర" స్వరూపమయ్యింది.  వ్యక్తి సాధించవలసిన అనేక ధర్మాల్లో ఒక్కొక్క సందర్భంలో పరస్పర ఘర్షణ ఏర్పడుతుంది. ఒక ధర్మాన్ని నిలిపేటప్పుడు, మరో ధర్మం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో ఒకదాన్ని మరోదానితో ఎలా సమన్వయించాలి, దేనికి ఎంత ప్రాధాన్యమివ్వాలి? అనేది 'సూక్ష్మధర్మం'. అది తెలియడమే ధర్మసూక్ష్మం.ఆ సూక్ష్మజ్ఞానమే రాముడి వ్యక్తిత్వం. 

పాలనా ధర్మరక్షణ, వ్యక్తిగత కుటుంబ ధర్మనిర్వహణ... రెండింటికీ పొంతన కుదరనప్పుడు దేనికీ విఘాతం కలగకుండా కాపాడిన రాముడు... దశరథ రామునిగా, సీతా రామునిగా, అయోధ్య రామునిగా విజయశీల వ్యక్తిత్వాన్ని ప్రతిష్ఠించాడు.  శ్రీరాముడు కౌమారదశనుండే తన రక్షణ స్వభావాన్ని ప్రకటించాడు. అధర్మాన్ని శిక్షించడంలో కాఠిన్యం, ధర్మ రక్షణలో కారుణ్యం...  ఈ రెండింటి పొందిక శ్రీరాముడిలోని కరుణ వీర రస సమన్వయం. ప్రసన్న, ప్రతాపమూర్తిమత్వం.  యువరాజయ్యే అర్హత కలిగిన వయస్సులోనే శ్రీరాముని దివ్యగుణాలకు అయోధ్య వాసులు ఆకర్షితులుయ్యారు. ఆరాధించారు. ఆ దశలోనే రామచంద్రుడు వారి బాగోగులను గమనించడం, తండ్రి తనయులను ఆదరించినట్లుగా మన్నించడం... ఇవన్నీ ఉత్తమ పాలక స్వభావాలను స్పష్టం చేశాయి. ఒకవైపు పూర్వీకులనుండి అనుసరిస్తున్న పటిష్టమైన ధర్మపరంపరకు రాముని ప్రత్యేకత తోడయ్యింది.  ముఖ్యంగా రామకథను పరిశీలిస్తుంటే అయోధ్యతో రామునకు, రామునితో అయోధ్యకు ఉన్న ప్రగాఢాత్మీయబంధం సుందరంగా గోచరిస్తుంది. 

బాల్యం నుండి రాముని పట్ల అయోధ్యకు ప్రేమ. యుక్తవయసు రాగానే వ్యవహారంగా దశరథుడు పాలకుడైనా, ప్రజల మనసుకు మాత్రం రాముడే ప్రభువు. అది గమనించే దశరథుడు యువరాజ పట్టాభిషేకానికి నిర్ణయించుకున్నాడు.  జగద్రక్షణకై, వనవాసం నెపంతో రాముడు రాజ్యాన్ని త్యజించాడు. ఆ సమయంలో అయోధ్య కన్నీరు మున్నీరయ్యింది. రాముని వదలలేక అయోధ్యలో అనేక మంది ఆయన వెంటవెళ్లారు. వెళ్లే అవకాశం లేనివారు కేవలం శరీరాలే అక్కడ మిగిలినట్లయ్యారు. చిత్రమేమిటంటే - అయోధ్యలోని మానవులే కాదు పశు పక్ష్యాదులు, వృక్షలతాదులు కూడా దుఃఖించాయట.

 "దూడలు పాలు తాగడం లేదు. అవి పాలు తాగలేదని కూడా గోవులు గమనించలేదు. అప్పుడే తొలి బిడ్డను ప్రసవించిన తల్లి, తన ప్రథమ మాతృత్వపు మాధుర్యాన్ని కూడా అనుభవించడం లేదు. అన్నం పెట్టమని పిల్లలు అడగడం లేదు. తినమని పెద్దలు చెప్పడం లేదు" అని వర్ణించాడు వాల్మీకి. రామునితో వెళ్ళిన వారిని కూడా, రాముడు విడిచి వెళ్ళాక, వారు చేసేదేమీ లేక వెనుదిరిగారు. వెనక్కివచ్చిన వారితో ఇంటి వారంతా "రాముని వదలి, రాముడులేని రాజ్యంలో ఏం సాధిద్దామని వచ్చారు?" అని వాపోయారు.   “అయోధ్యలో చరితార్థుడైన సత్పురుషుడు లక్ష్మణుడు మాత్రమే. అతడొక్కడే రామునితో వెళ్లాడు. రాముని వదలనివారే సత్పురుషులు” అని తీర్మానించుకున్నారు. 

బీడుపడ్డట్టుగా అయింది అయోధ్య.  శ్రీరాముని తిరిగి అయోధ్యకు రప్పించి రాజ్యాన్ని అప్పగించాలనుకున్న తన ప్రయత్నాలు వ్యర్థమయ్యాక, పాదుకలు తీసుకుని అయోధ్యకు చేరాడు భరతుడు. కానీ రాముని తప్ప ఏ ఒక్కరినీ ప్రభువుగా అంగీకరించలేని అయోధ్య, శ్మశానసదృశంగా గోచరించడంతో, భరతుడు అయోధ్యను వీడి నందిగ్రామంలో పాదుకాపట్టాభిషేకం చేశాడు.
అక్కడినుంచే అయోధ్యను పాలించాడు. తిరిగి రాముడు వచ్చాకే అయోధ్యకు కళ వచ్చింది. రాముని పాలనలో అయోధ్య ధర్మరాజ్యం మాత్రమే కాక, 'రామ ప్రేమ రాజ్య'మయ్యింది. రామభక్తి సామ్రాజ్యమయ్యింది.  వ్రేపల్లే వాసుల కృష్ణ ప్రేమకు, అయోధ్యవాసుల రామప్రేమ ఏ మాత్రం తీసిపోదు.   రామపాలనలో జనులంతా రామమయులయ్యారు. “రామ భూతం జగద భూత్"... అంటాడు వాల్మీకి. అయోధ్య ప్రజలకు “అంతా రామమయ”మయింది. వారి మాటల్లో తొంభై తొమ్మిది శాతం రామనామమే. రాముని కబుర్లే.

"నిరంతరం రాము దర్శిస్తూ, ప్రజల్లో హింసాప్రవృత్తి నశించింది” అనే అద్భుతమైన మాటను పలికాడు వాల్మీకి.రామచరిత్ర, వ్యక్తిత్వం నిత్యస్మరణగా కలిగిన వారి హృదయంలో హింసా భావనలు, వ్యతిరేక ధోరణులు నశిస్తాయని ఆ ఆదికవి ఉద్దేశం. ఈ ప్రగాఢ ప్రేమబంధం ఫలితంగానే అవతార పరి సమాప్తివేళ, వారందరినీ తనతో పాటుగా పరంధామంలో ప్రవేశింపజేశాడని రామాయణం, ఇతర పురాణాలు పేర్కొన్నాయి. 

'అయోధ్య' అంటేనే 'ఇతరులు (శత్రువులు) దెబ్బ తీయలేనిచోటు' అని అర్థం. సాకేతం- అంటే 'జ్ఞానస్థలం' అని ప్రధానార్థం. శ్రీరామచంద్రమూర్తి ఏ హృదయంలో ఉంటాడో వారి జీవితమే రామభక్తి సామ్రాజ్యం.  ఆ మానసంలో దుర్గుణాలనే అంతశ్శత్రువులు ప్రవేశించ లేవు. కనుక అదే 'అయోధ్య'. అది జ్ఞానమయస్థానం కనుక అదే 'సాకేతం'.   అందుకే రామభక్తులు 'రాముని వారము మాకేమి విచారము' (రామదాసు) అని ధీమాగా పలుకుతారు. 'తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు' అని నిర్భయంగా కీర్తిస్తారు.