పాకిస్థాన్, శ్రీలంకల వన్డే సిరీస్ రద్దు?

పాకిస్థాన్, శ్రీలంక మధ్య పాకిస్థాన్‌లో జరుగుతున్న వన్డే సిరీస్‌ రద్దయ్యే పరిస్థితులు ఏర్పాడ్డాయి. పాక్‌లో పర్యటిస్తోన్న లంక జట్టులోని ఎనిమది మంది ఆటగాళ్లు  గురువారం (నవంబర్ 13) స్వదేశానికి వెళ్లిపోయారు. తాజాగా ఇస్లామాబాద్‌లో బాంబు పేలుడుతో 12 మంది మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఈ ఆటగాళ్లు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారని క్రికెట్‌ శ్రీలంక వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితుల్లో గురువారం రావల్పిండిలో జరగాల్సిన రెండో వన్డే జరిగే అవకాశం లేకుండా పోయింది.  మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రావల్పిండిలోనే జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ గెలిచింది. మూడో వన్డేకూ రావల్పిండి ఆతిథ్యమివ్వాల్సింది. షెడ్యూలు ప్రకారం వన్డే సిరీస్‌ తర్వాత శ్రీలంక, జింబాబ్వే, పాకిస్థాన్‌లతో పాక్‌లోనే ముక్కోణపు సిరీస్‌ ఆడాల్సి ఉంది. 

ఇస్లామాబాద్‌కు చాలా దగ్గర్లోనే రావల్పిండి ఉండడం భద్రతపై తమ క్రికెటర్లు ఆందోళన చెందడానికి కారణమని ఓ శ్రీలంక బోర్డు అధికారి చెప్పాడు. దాంతో పాక్‌-శ్రీలంక సిరీస్‌ రద్దైనట్లే. 2009లో లాహోర్‌లో గడాఫీ స్టేడియానికి వెళ్తుండగా శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. అజంత మెండిస్, చమింద వాస్, మహేల జయవర్దనే సహా చాలా మంది ఆటగాళ్లు ఈ దాడిలో గాయపడ్డారు. అనేక మంది భద్రత సిబ్బంది మృతి చెందారు. ఆ దాడి నేపథ్యంలో దాదాపు దశాబ్దం పాటు ఏ విదేశీ క్రికెట్ జట్టూ   పాకిస్థాన్‌కు వెళ్లలేదు. విశేషమేంటంటే.. 2019 డిసెంబరులో శ్రీలంక పర్యటనతోనే పాకిస్థాన్‌కు తిరిగి విదేశీ జట్ల రాక మొదలైంది. ఇప్పుడు తాజా పేలుళ్లతో విదేశీ జట్లు పాక్‌లో పర్యటనకు సంశయించే పరిస్థితి తలెత్తింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu