బాబోయ్ నాకు టిక్కెట్ వద్దు...నన్ను వదిలేయండి ...నరసన్న పేటలో పోటీకి అచ్చెన్నాయుడు ససేమిరా
posted on Mar 26, 2012 11:26AM
ఎక్కడైనా ఎన్నికలొచ్చాయంటే ప్రధాన పార్టీల టిక్కెట్ల కోసం అభ్యర్థులు ఎగబడుతుంటారు. అలాంటిది శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటలో తెలుగుదేశం తరపున పోటీ చెయ్యాల్సిందిగా స్వయానా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినప్పటికీ కింజరాపు అచ్చెన్నాయుడు మాత్రం అంగీకరించడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయిన అచ్చెన్నాయుడు మరోసారి కూడా వోటమి పాలైతే తన రాజకీయ జీవితం సమాధి అయిపోతుందనే భయంతోనే పోటీకి ససేమిరా అంటున్నారు. కేంద్రమాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడి సోదరుడైన అచ్చెన్నాయుడు వ్యక్తిగత కారణాల వల్ల తాను పోటీ చేయలేనని పైకి అంటున్నారు. అయితే పార్టీ తనను కాకుండా ఎవరిని నిలిపినా అతని విజయానికి కృషి చేస్తానంటున్నారు.
అయితే ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీలోని అచ్చేన్నాయుడి వ్యతిరేక వర్గీయులు కూడా ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని పట్టుబడుతున్నారు. ఆయనకు టిక్కెట్ ఇస్తే విజయానికి కృషి చేస్తామని వారు చెబుతున్నారు. కాని నిజంగా అచ్చెన్నాయుడు పోటీ చేస్తే అతనిని వోడించి జిల్లాలో కింజరాపు సోదరుల ప్రతిష్టను దెబ్బతీయాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది. ఈ వ్యతిరేక వర్గీయులకు మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ఆశీస్షులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కుట్రను పసిగట్టిన కింజరాపు అచ్చెన్నాయుడు ఎట్టిపరిస్థితుల్లోనూ తాను పోటీ చేయనని అంటున్నారు.