సీఎం ఇష్యూ:అధిష్టానానికి పెద్దిరెడ్డి వార్నింగ్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై  చిత్తూరు జిల్లా శాసనసభ్యుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని గద్దె దింపాలని ఆయన అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. అధిష్టానం చేసిన తప్పు అధిష్టానమే సరిదిద్దుకోవాలని అన్నారు. లేకపోతే తామే పార్టీని వదిలి వెళతామని హెచ్చరించారు. కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించి పార్టీ అధిష్టానవర్గం ఇప్పటికే తప్పు చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో పార్టీకి ఇంతకంటే జరగాల్సిన నష్టం ఏమి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్‌ను మార్చకుంటే పార్టీ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతుందన్నారు. సిఎంను మార్చకుంటే తాము రాజీనామా చేసేందుకు వెనుకాడే ప్రసక్తి లేదని హెచ్చరించారు. బడ్జెట్ సమావేశాల తర్వాత రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఆయన అంతకుముందు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో భేటీ అయ్యారు. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కూడా బొత్సతో భేటీ అయ్యారు.

కాగా పదిహేను నిమిషాల వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైంది. టిడిపి, తెరాస, బిజెపి ఎమ్మెల్యేలు తెలంగాణపై పట్టుబట్టడుతూ పోడియం వద్దకు దూసుకు వెళ్లారు. దీంతో స్పీకర్ సభను మరోసారి రేపటికి వాయిదా వేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu