కేంద్రానికి మళ్ళీ తమిళ సెగ

 

యుపీయే ప్రభుత్వానికి శ్రీ లంక రూపంలో దురదృష్టం ఇంకా వెంటాడుతూనే ఉంది. మొన్న కరుణానిధి పేల్చిన మద్దతు ఉపసంహరణ బాంబు దెబ్బకి యుపీయే కుప్పకూలి పోతుందని అందరూ భావించినప్పటికీ ఆపద్బాందవుల వంటి యస్పీ బీయస్పీ లు చక్రం అడ్డువేయడంతో ఇంకా నిలిచి ఉంది. ఎందరికో హ్యాండిచ్చిన తనకే డీయంకే హ్యాండిచ్చినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బాధపడకుండా తమిళ తంబిల కోరిక మేరకు ఐక్య రాజ సమితిలో శ్రీ లంకకు వ్యతిరేఖంగా ఓటేసి వచ్చి వారిని ప్రసన్నం చేసుకొందామనుకొంది. కానీ, అంతలోనే కామన్వెల్త్ దేశాల సమావేశం కూడా సరిగ్గా ఇప్పుడే వచ్చింది. అది కూడా శ్రీ లంక దేశంలోనే నిర్వహించబడతాయి గనుక యుపీయే సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. ఈసారి తన బద్దశత్రువయిన కరుణానిధి కంటే ముందుగానే తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత ప్రధాని మన్మోహన్ సింగుకి ఆ సమావేశాలను బహిష్కరించాలని కోరుతూ లేఖ వ్రాసారు. తద్వారా సభ్య దేశాలకు శ్రీలంక సంజాయిషీలు చెప్పుకోవలసి వస్తుందని, అది ఆ ప్రభుత్వం పై ఒత్తిడి సృష్టించి అక్కడ నివశిస్తున్న అమాయకులయిన తమిళుల ప్రాణాలు కాపాడుతుందని ఆమె వ్రాసారు. మానవ ధర్మంగా శ్రీ లంక లోని తమిళులను కాపాడవలసిన బాద్యత ఒక్క శ్రీ లంక మీదే కాక అందరి మీద ఉంది. కానీ, ఆ దేశంతో ఉన్న వ్యాపార సంబందాలు దెబ్బతింటాయనే భయంతో భారత్ తో సహా అనేక దేశాలు వెనకడు వేస్తున్నాయి. ఇటీవలే భారత్ ఆ దేశానికి వ్యతిరేఖంగా ఐక్యరాజ సమితిలోఓటేసి వచ్చింది కనుక, ఇప్పుడు కూడా కామన్ వెల్త్ సమావేశాలను బహిష్కరించే అవకాశం ఉంది.