రాంనాథ్ వారసుల ఎన్నికలో ప్రముఖులు వీరే

మన దేశంలో ప్రతి ఎన్నిక కూడా చాలా ఇంట్రస్ట్ ను క్రియేట్ చేసేదే. అందులోనూ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎన్నిక సమీపిస్తుందంటే దాని చుట్టూ నడిచే స్పెక్యులేషన్స్ సంగతి చెప్పనే అక్కర్లేదు. ప్రణబ్ ముఖర్జీ వారసుడిగా వచ్చిన కోవింద్ ఎన్నికకు ముందు 2017లో  అలాంటి  స్పెక్యులేషన్సే  నడిచాయి. ఇప్పుడాయన టర్మ్ కి వచ్చే జులైతో ఎండ్ కార్డు పడుతుంది. దీంతో రాంనాథ్ కోవింద్ వారసుడెవరన్నది ఆసక్తికరంగా మారింది. అంతకన్నా ఎక్కువగా... ఆయన తరువాత వారసుడు వస్తాడా లేక వారసురాలా అనేది మరింత క్యూరియాసిటీ సృష్టిస్తోంది. ఈసారి కేంద్రంలోని బీజేపీ పెద్దలు వారసురాలికే కాస్త ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే 2007లో కాంగ్రెస్ తరఫున ప్రథమ పౌరురాలిగా బాధ్యతలు చేపట్టిన ప్రతిభా పాటిల్ తరువాత.. ఆ అవకాశం ఎవర్ని వరిస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది.

అయితే బీజేపీ పెద్దల పరిశీలనలో ఇప్పటికే దేశమంతా సుపరిచితురాలైన నిర్మలా సీతారామన్ పేరున్నట్టు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. నిర్మల ఇంతకుముందు రక్షణ శాఖ మంత్రిగా, ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దక్షిణాది నుంచి అగ్రవర్ణ శాఖకు చెందిన నిర్మల బీజేపీ ముఖ్య నేతల్లో ఒకరిగా ఎదిగారు. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా ల సరసన నిర్మల పేరు వినిపిస్తుంటుంది. మంచి రూపం, మంచి భాష, సంప్రదాయపూర్వకమైన  ఆహార్యంతో పాటు ధైర్య సాహసాలు ప్రదర్శించే వనితగా పేరు సంపాదించుకున్నారు నిర్మల. రక్షణ శాఖ మంత్రి హోదాలో దేశ సరిహద్దుల్లో పర్యటించి అందరిచేతా శభాష్ అనిపించుకున్నారు. అసలామె బీజేపీలోకి రావడమే విచిత్రంగా జరిగింది. ఎన్డీయే హయాంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్న ఆమె బీజేపీ నేతల దృష్టిలో పడింది. ఫలితంగా ఆమె 2006లో బీజేపీలో చేరి  అంచెలంచెలుగా ఎదిగారు. 

ఇక నిర్మలతో పాటు మరో ఆప్షన్ గా ప్రస్తుత రాజ్యసభ ఎంపీ, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్  గొగోయ్ పేరు కూడా వినిపిస్తోంది. దక్షిణ భారతంతో పాటు మహిళకు ప్రాధాన్యతనిచ్చే క్రమంలో నిర్మల పేరును పరిశీలిస్తున్నట్టే... సెవెన్ సిస్టర్స్ గా పేరున్న ఈశాన్య రాష్ట్రాలకు అంతే ప్రాధాన్యతనిచ్చే క్రమంలో  రంజన్ గొగోయ్ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా బీజేపీ ఈశాన్య రాష్ట్రాలను కూడా సమాన ప్రాధాన్యతాంశంగా ఎంచుకుంది. రంజన్ గొగోయ్ హయాంలోనే రాంమందిర్ వంటి కీలకమైన తీర్పును దేశప్రజలు పొందగలిగారు. బీజేపీ ఐడియాలజీతో  ఏనాడూ  పెద్దగా పొసగని గొగోయ్ తన తీర్పుతో బీజేపీ నేతల దృష్టిని ఆకర్షించడం విశేషం. పలు సంచలనాత్మకమైన  తీర్పులే కాక, కొన్ని సందర్భాల్లో వివాదాలకూ కారణమైన గొగోయ్ కి బీజేపీ అధిక ప్రాధాన్యతనిస్తుండడం చెప్పుకోదగ్గ అంశం. 

ఇక రాష్ట్రపతి కోటాలో ఈశాన్య రాష్ట్రాల నుంచి గొగోయ్ కి గనుక అవకాశం ఇస్తే ఉపరాష్ట్రపతిగా మళ్లీ దక్షిణాదికే ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు అవకాశం కల్పించడంపై  చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి బీజేపీ పెద్దలు ఈసారి ఈశాన్య, దక్షిణాది ప్రాంతాల నుంచి అత్యున్నతమైన రాజ్యంగ పదవులకు ప్రాధాన్యత కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

ఇక 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో రాంనాథ్ కోవింద్ చేతిలో కాంగ్రెస్ తరఫున లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ఓటమిపాలయ్యారు. అయితే ఈసారి అదే సామాజికవర్గానికి చెందిన మల్లికార్జున  ఖర్గేను  రాష్ట్రపతి ఎన్నికకు రంగంలోకి దించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఖర్గే కర్నాటకకు చెందిన సీనియర్ నేత కావడం ఆయనకు బాగా కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఐదు  రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడతాయి. ఆ తరువాత  బీజేపీ, కాంగ్రెస్ లు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించి వారి అభ్యర్థులను  ప్రకటించే అవకాశం ఉంది.