ఐటీ రైడ్స్‌పై సోనూసూద్ స్పంద‌న‌.. ఆయ‌న ఏమ‌న్నారంటే...

సోనూసూద్ ఇల్లు, కార్యాల‌యాల‌పై నాలుగు రోజుల పాటు ఐటీ సోదాలు. 20 కోట్ల వ‌ర‌కూ ప్ర‌భుత్వానికి ప‌న్నులు ఎగ్గొట్టార‌ని తేల్చారు. ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలో సోనూసూద్ ట్ర‌స్ట్‌కు 18 కోట్ల వ‌ర‌కూ విరాళాలు వ‌స్తే.. అందులో కేవ‌లం 1.9 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేశార‌ని.. మిగ‌తా డ‌బ్బు ఆ సంస్థ ఖాతాలోనే ఉండిపోయిందని ఐటీ అధికారులు బ‌హిర్గ‌తం చేశారు. ఇలా ప్ర‌ముఖ న‌టుడు, స‌మాజ సేవ‌కుడు సోనూసూద్ గురించి ఐటీ శాఖ బ‌య‌ట‌పెట్టిన సంచ‌ల‌న విష‌యాలు ఆయ‌న ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేశాయి.

ఇంత‌కీ సోనూసూద్ మంచోడా? చెడ్డోడా? అనే అనుమానాలు దేశ‌వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. దీంతో.. నాలుగు రోజుల ఐటీ రైడ్స్ త‌ర్వాత సోనూసూద్ స్పందించారు. ఆ మేర‌కు ట్వీట్ చేశారు. విషయమేదైనా సరే సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని అన్నారు. 

‘ఏ విషయంలోనైనా ప్రతిసారీ నువ్వు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. మంచి మనస్సుతో భారతదేశ ప్రజలందరికీ నా వంతు సాయం చేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నాను. సాయం కోసం చూసే ప్రజలతోపాటు ఒక విలువైన ప్రాణాన్ని కాపాడటం కోసమే నా సంస్థలోని ప్రతి రూపాయీ ఎదురుచూస్తోంది. నేను ప్రచారకర్తగా వ్యవహరించినందుకుగాను వచ్చే పారితోషికాన్ని మానవసేవ కోసం వినియోగించాలని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయా బ్రాండ్‌ సంస్థలకు సూచించాను. అలా, మా ప్రయాణం కొనసాగుతోంది. గడిచిన నాలుగు రోజుల నుంచి వ్యక్తిగత పనుల్లో (ఐటీ దాడులు) బిజీగా ఉండటం చేత మీకు అందుబాటులో లేను. మళ్లీ సేవలందించేందుకు ఇప్పుడు మీ ముందుకు వచ్చేశాను’ అంటూ సోనూసూద్‌ ట్వీట్‌ చేశారు.