ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసులో జ‌గ‌న్ స‌ర్కారుకు హైకోర్టులో షాక్‌..

ఏపీ ఫైబ‌ర్ నెట్ కేసుతో ప‌లువురికి ఉచ్చు బిగుస్తోంది ఏపీ ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే ఈ కేసులో ప‌లువురిని అరెస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ కు సంబంధించిన కేసులో రెండు రోజుల కిందట అరెస్టైన ఐఆర్‌టీఎస్‌ అధికారి కోగంటి సాంబశివరావుకు.. తాజాగా హైకోర్టులో ఊరట లభించింది. 

మధ్యంతర బెయిల్ పిటిషన్‌తో పాటు సీఐడీ నమోదు చేసిన కేసు కొట్టేయాలని ఇప్ప‌టికే సాంబ‌శివ‌రావు హైకోర్టులో పిటిష‌న్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లపై విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. 48 గంటల్లో బెయిల్‌ రాకపోతే తన ఉద్యోగం పోతుందని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం సాంబశివరావుకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.  

ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌కు సంబంధించిన తొలి దశ టెండర్లను గత ప్రభుత్వ హయాంలో టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అక్రమంగా కట్టబెట్టారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సాంబశివరావును సీఐడీ అధికారులు శనివారం అరెస్టు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి కావ‌డంతో అరెస్ట్ అయి విధుల‌కు హాజ‌రుకాక‌పోతే ఉద్యోగం పోయే ప్ర‌మాదం ఉంది. అందుకే, ఆయ‌న హుటాహుటిన హైకోర్టును ఆశ్ర‌యించ‌డం.. హైకోర్టు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ ఇవ్వ‌డంతో సాంబ‌శివ‌రావుకు ఊర‌ట ల‌భించిన‌ట్టైంది.