సోనియాకు కోమటిరెడ్డి లేఖ
posted on Nov 10, 2011 12:46PM
హైదరాబాద్: తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతూ మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు.తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారనే నమ్మకంతోనే తాను ఆమరణ నిరాహార దీక్ష విరమించానని ,రేపటి పార్టీ కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెసు ప్రభుత్వమే తెలంగాణ ఇస్తుందన్న ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆయన సోనియాను కోరారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నల్లగొండలోని క్లాక్ టవర్ వద్ద ఆయన నవంబర్ 1వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఆయనకు ఆరోగ్యం క్షీణించడంతో నిమ్స్ లో చేర్చారు. అయితే, కుటుంబ సభ్యుల నుంచి, పార్టీ పార్లమెంటు సభ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఆయన దీక్ష విరమించారు. ప్రస్తుతం ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయనను గురువారం సాయంత్రం నిమ్స్ నుంచి డిశ్చార్జీ చేసే అవకాశాలున్నాయి.