ఓయు విద్యార్థుల వినూత్న నిరసన

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు తెలంగాణ కోసం వినూత్న నిరసన తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారంటూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దిష్టిబొమ్మకు విద్యార్థులు చెప్పుల దండ వేసి నిరసన తెలియజేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఉండి తన రాష్ట్రాన్ని నాలుగుగా చేయడానికి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెడతామన్న యుపి సిఎం మాయావతికి పూలదండలు వేశారు. కాగా మరోవైపు టిఎన్జీవో భవనంలో ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీ, ఎస్సార్సీ ఒప్పుకునేది లేదని, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ విజ్ఞప్తి మేరకు తాము సకల జనుల సమ్మె వాయిదా వేసుకున్నామని, ఆయన తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యతిరేక కుట్రల్ని ఎదుర్కొంటామన్నారు. 1956కు ముందు ఉన్న తెలంగాణే ఇవ్వాలని లేదంటే ఏ క్షణంలోనైనా ఉద్యమంలో పాల్గొంటామన్నారు. ముఖ్యమంత్రి ఉద్యమాన్ని అణిచివేసే చర్యలు, ఉద్యోగుల్ని చీల్చే కుట్ర మానుకోవాలన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu