తుపాన్‌లాంటి ఉద్యమం చేపడతాం : కేసీఆర్
posted on Nov 11, 2011 7:43AM
హైదరాబాద్
: ఆంధ్రప్రదేశ్‌లో ఏ తెలంగాణనైతే విలీనం చేశారో ఆ తెలంగాణానే తమకు కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు.చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు రెండో ఎస్సార్సీయే తమ విధానమంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో కేంద్రం మెలికపెడితే తుపాన్‌లాంటి ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.ముందు తమ పార్టీలో ఉద్యమ స్వరూపంపై చర్చించి ఆ తర్వాత జేఏసీ ముందుకు తీసుకువెళ్తామని, ఆ తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు.ఢిల్లీలోని కాంగ్రెస్ నేతలు తలాతోక లేని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రకటనలతో తెలంగాణ ప్రాంత ప్రజలు గందరగోళానికి గురవుతున్నట్టు చెప్పారు.
ఇకపోతే తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చేసిన రాజీనామాలను ఆమోదించనందున అటు శాసనసభకు, ఇటు పార్లమెంట్‌కు హాజరై సభా కార్యక్రమాలను స్తంభింపచేస్తామని తెలిపారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా తాము పని చేస్తామని స్పష్టం చేశారు. 1956కు ముందున్న తెలంగాణాయే తమ లక్ష్యమని, హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ తాము కోరుకుంటున్నామని చెప్పారు.తమ ఉద్యమంలో భాగంగా ఈ నెల 16 నుంచి 21 వరకు పది జిల్లాల్లో తెరాస నేతలు పాదయాత్రలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. పాదయాత్రలతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ పాదయాత్రలకు తెలంగాణ సాధన పాదయాత్రలుగా నామకరణం చేసినట్టు కేసీఆర్ తెలిపారు.